మొదలైంది.. ఎన్నారైలకు నోటీసుల పరంపర!! ఎన్నారైలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, ఆదాయం గురించి.. ఆదాయపు స్టేటస్ గురించి.. ఆదాయపు పన్ను వారి ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి నోటీసులు మొదలయ్యాయి. మీకూ తెలిసే ఉంటుంది. పన్ను భారం విధించడానికి ప్రమాణం.. మీ రెసిడెంట్ స్టేటస్. అంతేకాని ఎటువంటి సందర్భంలో పౌరసత్వంతో సంబంధం లేదు.
ఒక వ్యక్తి భారతదేశంలో 182 రోజులు లేదా ఎక్కువ రోజులు నివాసం ఉంటే రెసిడెంట్ అవుతారు లేదా ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, గత నాలుగు సంవత్సరాల్లో 365 రోజులున్నా రెసిడెంట్లు అవుతారు. మిగతా వారందరూ నాన్–రెసిడెంట్లు అవుతారు. స్థూలంగా చెప్పాలంటే పన్ను విధింపు, లెక్కింపు మొదలైన విషయాల్లో రెసిడెంట్లకు, నాన్–రెసిడెంట్లకు ఎన్నో తేడాలున్నాయి. నోటీసులో ఏయే అంశాలు అడుగుతున్నారంటే..
విదేశాలకు ఎప్పుడు వెళ్లారు?
ఏ సంవత్సరంలో విదేశాల్లో బ్యాంకు అకౌంటు తెరిచారు?
ఆ అకౌంటు వివరాలు
ఆ రోజు నుంచి రెసిడెంట్ స్టేటస్
పాస్‌పోర్ట్‌లో రాక/పోకకి సంబంధించి ఎంట్రీలు
బ్యాంకు అకౌంటు ఎటువంటిదైనా వివరాలు ఇవ్వాలి
స్థిరాస్తి వివరాలు
ఆదాయ వివరాలు
పన్ను చెల్లింపు వివరాలు
సంబంధిత వివరాలు
విదేశీ సంస్థల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి నోటీసులు.. అవసరమైతే సమన్లు ఇస్తున్నారు. నలభై సంవత్సరాల చరిత్ర అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది అసమంజసం అని అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని కొట్టేస్తున్నారని అంటున్నారు. చట్టప్రకారం ఒకప్పుడు 16 సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. ఆ పదిని 5 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కాలపరిమితిని అనుసరించి విదేశీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఎన్నారైలు కానివారి దగ్గర్నుంచి.. అంటే రెసిడెంట్లు దగ్గర్నుంచి అడుగుతారు.
నాన్–రెసిడెంట్లు .. వారున్న దేశం – అంటే విదేశంలోని ఆస్తుల వివరాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి బాధ్యత లేదు. మరయితే ఎవరిపైన ఈ అస్త్రాలు అంటే.. ‘‘రెసిడెంట్ స్టేటస్‌లో ఉంటూ నాన్–రెసిడెంట్లుగా చలామణీ అవుతున్న’’ వారి మీద. మనం వాడుక భాషలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ‘ఎన్నారై’లు అనేస్తాం. కానీ, చట్టప్రకారం స్టేటస్ లెక్కించాలి. అనుమానం వస్తే నోటీసుల ఇస్తారు. సమాచారం అడుగుతారు. ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తారు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. డిపార్ట్‌మెంట్ వారు బ్లాక్‌మనీ చట్టానికి సంబంధించిన అధికార్లకు రిఫర్ చేయొచ్చు. వారు వారి పని చేస్తారు.
ఎలా బయట పడాలి?
విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం/చదువు కోసం వెళ్లినవారు విధిగా అన్ని రికార్డులు నిర్వహించండి. వీలుంటే ఫ్లైట్ టికెట్లు, బోర్డింగ్ పాస్‌లు, సంబంధిత ఈమెయిల్స్, పాస్‌పోర్టులు, పాతవి, లేటెస్టువి, వీసాకు సంబంధించిన కాగితాలు, విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లు, ఏ తేదీ నాడు ఎంతెంత చేశారు.. ఏమి కొన్నారు .. స్థిరాస్తులు, మొదలైనవి రెడీగా ఉంచండి. అడిగినప్పుడు సకాలంలో ఇవ్వండి. నిజాయితీగా. ఆలస్యం అవుతుందంటే ఆ విషయం చెప్పండి. గడువు తేదీ లోపల స్పందించండి.
మీరు నిజంగానే నాన్–రెసిడెంట్ అయితే, మీరు భయపడక్కర్లేదు. ఎవరినీ భయపెట్టడం లేదు. ముందు నుంచి మనం చెప్పేది ఒకటే. మీరు చేసే ఏ వ్యవహారానికైనా డాక్యుమెంట్లు తప్పనిసరి!!
Comments
Please login to add a commentAdd a comment