ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్‌ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్‌లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్‌ప్లే అవుతుంది. విభిన్న వెబ్‌సైట్‌లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్‌ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్‌ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్‌ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.
ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!
జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment