సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎగిరే కారు వచ్చేసిందోచ్.. నెదర్లాండ్‌కు చెందిన పాల్–వీ అనే కంపెనీ తొలి కారును సిద్ధం చేసింది. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇప్పుడు ఎవరైనా ఈ కారు కొనుక్కుని ఎంచక్కా ఎగిరేయొచ్చు. ఎగిరే కారు ఆలోచనలు ఇప్పటివి కావు. కానీ ఈ కల సాకారం కాలేదు. అంతెందుకు ఈ పాల్–వీ కారు తయారీకి కూడా 20 ఏళ్లు పట్టింది. ఈ ఎగిరే కారు పేరు ‘ది లిబర్టీ’. వాహనం బరువు తగ్గించేందుకు మూడు చక్రాలతో తయారు చేశారు. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందట. రోడ్డుపై వెళ్లేటప్పుడు ద లిబర్టీ రెక్కలు పైభాగంలో ముడుచుకుని ఉంటాయి. విమానంగా మారేటప్పుడు రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పీ గల ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
గంటకు 180 కి.మీ. వేగంతో..
రెండు సీట్లు మాత్రమే ఈ కారులో ఉంటాయి. గాలిలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ కోసం వెయ్యి అడుగుల రన్‌వే అవసరం కాగా.. ల్యాండ్ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది. ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్ ట్యాంకు కూడా ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మైలేజీ లీటర్‌కు 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే దీన్ని కొని గాల్లో ఎగిరేందుకు తహతహలాడకండి. ఎందు కంటే ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు 2022 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు విమానంగా ఉపయోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment