Vijay Shekhar Sharma Success Story: ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్స్ పాఠం చెబితే శబ్ధం తప్ప అర్థం తెలుసుకోలేని హిందీ మీడియం ఇబ్బందులు, సోదరి పెళ్లి కోసం అప్పులపాలై రోడ్డున పడేలా చేసిన కుటుంబ బాధ్యతలు, సామాన్యులైతే చాలు భారీ వడ్డీలతో నడ్డి విరిచే బ్యాంకుల కారణంగా తొలి స్టార్టప్ కంపెనీని అమ్మేయాల్సిన దుస్థితి. ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నా.. మొక్కవోని పట్టుదలతో ఒక్కో సమస్యని అధిగమిస్తూ ఈ రోజు ఏకంగా రూ.18,300 కోట్ల రూపాయల విలువైన కంపెనీని స్థాపించారు పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ.
దేశంలో హిందీ బెల్ట్‌లో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్.. విజయ్ శేఖర్ శర్మ సొంతూరు. తండ్రి స్కూల్ టీచర్. తండ్రికి వచ్చే జీతం కుటుంబ పోషణకి తప్ప మరే ఇతర అవసరాలు తీర్చేందుకు సరిపోయేది కాదు. ఆటల్లో గొప్ప ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు మధ్యలో అడ్డుకున్నాయి. అయితే టీచరు కొడుకు కావడంతో చదువులు ముందుండే వాడు. స్కూల్‌లో ఏ పరీక్షలు జరిగా ఫస్ట్ వచ్చేవాడు. చదువులో అతని ప్రతిభకు తగ్గట్టే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కాలేజీలో సీటు కూడా వచ్చింది.
ఇంగ్లీష్ కష్టాలు
అలీగఢ్ లాంటి ద్వితీయ శ్రేణి నగరం నుంచి ఒక్కసారిగా ఢిల్లీలాంటి కాస్మోపాలిటన్ సిటీలో అడుగు పెట్టాక శేఖర్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. అప్పటి వరకు పూర్తిగా హిందీ మీడియంలో చదవడంతో కాలేజీలో ఇంగ్లీషులో లెక్చరర్లు చెప్పే పాఠం ఒక్క ముక్క కూడా అర్థం అయ్యేది కాదు. ఇంజనీరింగ్ చేరిన కొత్తలో తారే జమీన్ పర్ సినిమాలో పిల్లవాడిలాంటి తరహా పరిస్థితే తాను ఎదుర్కొన్నట్టు అనేక సార్లు విజయ్ చెప్పారు. పాఠాలు అర్థం కాక కాలేజీ నుంచి బయటకు పారిపోవాలని ప్రతీ రోజు అనిపించేందంటూ గతాన్ని అనేక సార్లు గుర్తు చేసుకున్నారు. ఇంగ్లీషు డిఫెక్ట్‌తో అప్పటి వరకు బ్రైట్ స్టూడెంట్‌గా ఉన్న విజయ్ ఒక్కసారిగా చదువులో వెనకబడి పోయాడు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలంటూ ఒత్తిడి. దీంతో పరీక్షలు పాస్ అయ్యేందుకే అన్నట్టుగా టెస్ట్ పేపర్లలో ఆన్సర్లు బట్టీపట్టి పరీక్షలు పాసవడం అలవాటుగా మార్చుకున్నాడు.
రూట్ మారింది
క్లాస్ రూమ్, కాలేజీ క్యాంటీన్, గ్రౌండ్, ఎగ్జామ్స్ ఇలా క్యాంపస్‌లో ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్ అడుగడుగునా ఇబ్బంది పెట్టేది. ఇంగ్లీష్ నుంచి తప్పించుకునే మార్గం లేదని.. ఎలాగైనా నేర్చుకోవాలని విజయ్ శేఖర్ ఫిక్స్ అయ్యాడు. దీంతో ఇంగ్లీషు మీద పట్టు పెంచుకునేందుకు రెగ్యులర్‌గా ఇంగ్లీష్ పత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇందులో ఫోర్బ్స్ పత్రికలో వచ్చే బిల్‌గేట్స్, స్టీవ్‌జాబ్స్ లాంటి ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంటర్వ్యూలు శేఖర్‌పై ప్రభావం చూపాయి. గొప్ప కంపెనీలన్నీ గ్యారేజీల నుంచే ఎదిగాయనే విషయం అర్థమైంది. అంతే బీటెక్ పట్టా పుచ్చుకుని ఏదైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యం కాస్తా మారిపోయింది. వ్యాపారవేత్తగా మారాలనే ఆంకాంక్ష తెర మీదకు వచ్చింది.
సీఎంఎస్ సృష్టికర్త
కాలేజీలో తన లాంటి ఐడియాలజీ ఉన్న విద్యార్థులతో కలిసి తొలిసారి సీఎంఎస్ కంటెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని విజయ్ శేఖర్ శర్మ నెలకొల్పాడు. ఆ తర్వాత సీఎంఎస్ పేరుని ఎక్స్‌ఎస్ కమ్యూనికేషన్‌గా మార్చారు. ప్రముఖ దినపత్రికలు ఈ సీఎంఎస్‌ని ఉపయోగించేవి. కంపెనీ విస్తరణ కోసం రుణం ఇవ్వాలంటూ బ్యాంకుల చుట్టూ ఎంతగా తిరిగినా.. అవమానాలే తప్ప రుణం మంజూరు రాలేదు. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేదని, ష్యూరిటీగా ఏం చూపడం లేదంటూ బ్యాంకులు రుణం ఇచ్చేందుకు తిరస్కరించాయి. ఎన్నో పైరవీలు చేయగా చివరకు 24 శాతం వడ్డీతో ఓ బ్యాంకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చింది.
అప్పుల కుప్ప
ఎక్స్‌ఎస్ కమ్యూనికేషన్ నుంచి ప్రాఫిట్స్ రాకముందే నెలనెలా 8 లక్షల అప్పుపై 24 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఇదే సమయంలో తన సోదరి పెళ్లి చేసేందుకు తండ్రి దగ్గర సరిపడ డబ్బులు లేకపోవడంతో మరోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది శేఖర్‌కి. కొండలా అప్పులు.. రాచపుండులా మారిన వడ్డీల భారంతో కుదైలయ్యాడు శేఖర్. పార్ట్‌టైం జాబులు చేసినా వడ్డీలకే తప్ప అసలు బాకీ తీర్చేందుకు సరిపోలేదు. దీంతో ఎంతో కష్టపడి నిర్మించిన ఎక్స్‌ఎస్ కమ్యూనికేషన్ సంస్థని అతి తక్కువ ధరకే అమ్మేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. చేతికొచ్చిన కంపెనీ చేజారిపోగా.. చేతిలో చిల్లిగవ్వ లేక ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డట్టయ్యింది విజయ్ శేఖర్ శర్మ పరిస్థితి.
కష్టాల నుంచే
సామాన్యులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు, సేవలు అందించే విషయంలో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది చూపించే నిర్లక్ష్యం విజయ్‌ని ఎంతగానో కలచివేశాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రజలకు సర్వీస్ అందించే ఏదైనా చేస్తే బాగుంటుందనే ఐడియా పుట్టుకొచ్చింది. అప్పటికే ఇంటర్నెట్‌కి ఆదరణ పెరుగుతున్న విషయం గమనించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ సేవా లాంటివి అప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటిని రంగరించి 2010లో పేటీఎంకి రూపకల్పన చేశారు. ఫోన్ రీఛార్జ్, కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు సులువుగా చేసుకునేలా పేటీఎంని అందుబాటులోకి తెచ్చారు. పేటీఎం నెమ్మదిగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. రెండేళ్లలో రెండున్నర లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు.
నోట్ల రద్దుతో
2016లో జరిగిన రెండు ఘటనలు పేటీఎం రూపు రేఖలు మార్చేశాయి. ఒకటి జియో ఫోన్‌తో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరొకటి పెద్ద నోట్ల రద్దు. ఈ రెండు చర్యలతో పేటీఎం వ్యాపారం ఊహించని స్థాయికి చేరుకుంది. టీ కొట్టు మొదలు బడా బిజినెస్ మ్యాన్ వరకు అందరికి పేటీఎం అక్కరకు వచ్చింది. 2017 నవంబరు వచ్చే సరికి రెండు కోట్ల మంది కస్టమర్లు పేటీఎంకి వచ్చారు. స్టార్టప్ కాస్తా యూనికార్న్ కంపెనీగా మారిపోయింది. కంపెనీ పెట్టిన ఏడేళ్లకే బిలియనీర్ అయ్యాడు. 2017లో యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారమే విజయ్ శేఖర్ శర్మ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
చరిత్రలో అతి పెద్ద ఐపీవో
పేటీఎంని మరింతగా విస్తరించే లక్ష్యంతో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ కోసం సెబీకి దరఖాస్తు చేశారు విజయ్‌శేఖర్. అనేక పరిశీలన తర్వాత సెబీ ఐపీవోకి అనుమతులు ఇచ్చిన రోజున విజయ్ శేఖర్ నృత్యం చేసి తన సంతోషం పంచుకున్నారు. ఒకప్పుడు పది వేల రూపాయల అప్పు కోసం కాళ్లకు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టు తిరిగిన అతను ఏకంగా రూ.18,300 కోట్ల నిధులు సమీకరించేందుకు అనుమతి సాధించాడు. దేశంలో ఇదే అతి పెద్ద ఐపీవో కావడం విశేషం. పేటీఎం సంస్థ 4.83 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా 5.89 కోట్ల బిడ్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment