దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాకింగ్ రంగ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ)ను ప్రారంభించింది. గడిచిన పదేళ్లలో ఈ పథకంలో దాదాపు 53.14 కోట్ల మంది లబ్ధిదారులు చేరారు. అందరికీ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలనే ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.
గడిచిన పదేళ్లలో 53.14 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు తెరిచారు.
మార్చి 2015 వరకు 15.67 కోట్లు ఉన్న ఈ బ్యాంక్ ఖాతాలు అప్పటి నుంచి 3.6 రెట్లు పెరిగాయి.
ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.31 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఆగస్టు 2015 నుంచి ఈ డిపాజిట్లు 15 రెట్లు అధికమయ్యాయి.
వీటిలో దాదాపు 66.6% ఖాతాలు (35.37 కోట్లు) గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులవే కావడం విశేషం.
మొత్తం ఖాతాదారుల్లో దాదాపు 55.6% (29.56 కోట్లు) మహిళలు ఉన్నారు.
పీఎంజేడీవై చొరవతో దేశవ్యాప్తంగా 36.14 కోట్ల రూపే కార్డులను జారీ చేశారు. ఇది డిజిటల్ లావాదేవీల వృద్ధికి గణనీయంగా దోహదపడింది.
ఈ ఖాతాల ద్వారా 2024లో సుమారు 16,443 ఆన్‌లైన్ లావాదేవీలు జరిగాయి. 2019లో జరిగిన 2,338 కంటే ఇది చాలా ఎక్కువ.
పీఎంజేడీవై చెప్పుకోదగ్గ మైలురాళ్లు చేరుకున్నప్పటికీ, దాదాపు 8.4% ఖాతాలు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 20% అకౌంట్లు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి.
జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేయాలంటే కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. రూపే డెబిట్ కార్డ్‌లు వాడుతున్న ఖాతారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.
ప్రమాదానికి ముందు 90 రోజులలోపు ఖాతాదారులు తమ రూపే డెబిట్ కార్డ్‌ను కనీసం ఒకసారైనా వాడాలి. అలా చేస్తే బీమా ప్రయోజనాలకు అర్హులవుతారు.
ఏదైనా అత్యవసర సమయాల్లో ముందుగానే నగదు వినియోగించుకుని తర్వాత చెల్లించేందుకు వీలుగా రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు.
సమస్య ఏమిటంటే..
చాలా జన్‌ధన్ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు లేకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చింది. కానీ ఇది ఆశించిన మేర నెరవేరలేదని నివేదికలు చెబుతున్నాయి. గ్రామీణులకు ఇప్పటికీ బ్యాంకు లావాదేవీలపై సరైన అవగాహన ఏర్పరలేదు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉందనే విషయం చాలా మంది ఖాతాదారులకు తెలియదు. తెలిసినా ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై సరైన అవగాహన ఉండదు.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
జన్‌ధన్ 2.0 కార్యక్రమం కింద ఈ పథకాన్ని మరింత విస్తరించి ఖాతాదారుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో దాదాపు చాలామంది డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో కొత్త ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలనీ కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జన్‌ధన్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో డిజిటల్ లావాదేవీలను పెంచాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment