Jandhan Account
-
పదేళ్లలో ‘జన్‌ధన్’ విజయాలు.. సమస్యలు
దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాకింగ్ రంగ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ)ను ప్రారంభించింది. గడిచిన పదేళ్లలో ఈ పథకంలో దాదాపు 53.14 కోట్ల మంది లబ్ధిదారులు చేరారు. అందరికీ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలనే ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.గడిచిన పదేళ్లలో 53.14 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు తెరిచారు.మార్చి 2015 వరకు 15.67 కోట్లు ఉన్న ఈ బ్యాంక్ ఖాతాలు అప్పటి నుంచి 3.6 రెట్లు పెరిగాయి.ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.31 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఆగస్టు 2015 నుంచి ఈ డిపాజిట్లు 15 రెట్లు అధికమయ్యాయి.వీటిలో దాదాపు 66.6% ఖాతాలు (35.37 కోట్లు) గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులవే కావడం విశేషం.మొత్తం ఖాతాదారుల్లో దాదాపు 55.6% (29.56 కోట్లు) మహిళలు ఉన్నారు.పీఎంజేడీవై చొరవతో దేశవ్యాప్తంగా 36.14 కోట్ల రూపే కార్డులను జారీ చేశారు. ఇది డిజిటల్ లావాదేవీల వృద్ధికి గణనీయంగా దోహదపడింది.ఈ ఖాతాల ద్వారా 2024లో సుమారు 16,443 ఆన్లైన్ లావాదేవీలు జరిగాయి. 2019లో జరిగిన 2,338 కంటే ఇది చాలా ఎక్కువ.పీఎంజేడీవై చెప్పుకోదగ్గ మైలురాళ్లు చేరుకున్నప్పటికీ, దాదాపు 8.4% ఖాతాలు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 20% అకౌంట్లు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి.జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేయాలంటే కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. రూపే డెబిట్ కార్డ్‌లు వాడుతున్న ఖాతారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.ప్రమాదానికి ముందు 90 రోజులలోపు ఖాతాదారులు తమ రూపే డెబిట్ కార్డ్‌ను కనీసం ఒకసారైనా వాడాలి. అలా చేస్తే బీమా ప్రయోజనాలకు అర్హులవుతారు.ఏదైనా అత్యవసర సమయాల్లో ముందుగానే నగదు వినియోగించుకుని తర్వాత చెల్లించేందుకు వీలుగా రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు.సమస్య ఏమిటంటే..చాలా జన్‌ధన్ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు లేకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చింది. కానీ ఇది ఆశించిన మేర నెరవేరలేదని నివేదికలు చెబుతున్నాయి. గ్రామీణులకు ఇప్పటికీ బ్యాంకు లావాదేవీలపై సరైన అవగాహన ఏర్పరలేదు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉందనే విషయం చాలా మంది ఖాతాదారులకు తెలియదు. తెలిసినా ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై సరైన అవగాహన ఉండదు.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..జన్‌ధన్ 2.0 కార్యక్రమం కింద ఈ పథకాన్ని మరింత విస్తరించి ఖాతాదారుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో దాదాపు చాలామంది డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో కొత్త ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలనీ కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జన్‌ధన్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో డిజిటల్ లావాదేవీలను పెంచాలని యోచిస్తున్నారు. -
అలాంటి నకిలీ ఖాతాలు తొలగించండి - కేంద్ర ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద నకిలీ ఖాతాలను (ఒకటికి మించి ఉన్న) తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లను (ఆర్ఆర్బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అన్ని ఆర్ఆర్బీలు డిజిటల్ సామర్థ్యాలను అలవరుచుకోవాలని కోరారు. ఎంఎస్ఎంఈ శాఖ గుర్తించిన క్లస్టర్ల వద్ద ఆర్ఆర్బీలు శాఖలు తెరిచేలా చూడాలని ప్రాయోజిత షెడ్యూల్డ్ బ్యాంకులకు మంత్రి సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆర్ఆర్బీల చీఫ్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కర్ణాటకంలో ‘నోటుకు ఓటు’ దాసోహం
సాక్షి, న్యూఢిల్లీ : వాడిగా, ‘వేడి’గా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంతిమ అంకం ప్రారంభమైంది. చల్లగా నోట్లు చేతులు మారుతున్నాయి. ఓట్లు కొనేవారికి, అమ్మేవారికి మధ్య అనూహ్య ఆత్మీయ బంధం అలుముకుంటోంది. ‘జన్‌ధన్’ ఖాతా కలిగిన ప్రతి ఓటరు అకౌంట్లోకి వెయ్యి రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజున అంటే, మే 15వ తేదీన మరో వెయ్యి రూపాయలు ఆ ఖాతాలకు వచ్చి చేరుతాయట. ఈ లెక్కన కర్ణాటకలో ఓటుకు రెండు వేల రూపాయలు పలుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల కమిషన్ కనుగప్పి ఓట్ల వ్యాపారం బాగానే కొనసాగుతోంది. నేడు ఒక రాష్ట్రమంటూ కాకుండా ‘ఓటుకు నోటు’ సంప్రదాయం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అది పార్లమెంట్ ఎన్నికలయినా, అసెంబ్లీ ఎన్నికలయినా సంప్రదాయం కొనసాగాల్సిందే. 2008లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లను కొనుక్కునే సంప్రదాయం మొదటిసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. నోటు తీసుకొని ఓటు వేసిన వారి సంఖ్య 2008లో ఏడు శాతం ఉంటే అది 2014 ఎన్నికల నాటికి 15 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు వారి శాతం మరింత పెరిగే ఉంటుంది. దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ ప్రభావంగానే ఈ నోటుకు ఓటు సంస్కతి కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల్లో, ఓటర్లలో నైతికతను పెంచడం వల్ల ఈ దుస్సంప్రదాయాన్ని శాశ్వతంగా అరికట్టవచ్చని ఎవరైనా భావించవచ్చు. ఆ నైతికత ఎలా రావాలన్నది కూడా ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగం, పేదరికం..... దేశంలోని నిరుద్యోగం, పేదరికం, నైపుణ్య, అనైపుణ్య రంగాల్లో కనీస వేతనాలు ఎంత? కనీస వేతనాలపై బతికే కార్మిక లోకమెంత? మధ్యతరగతి వారు ఎంత? తదితర అంశాలపై ఆధారపడి ఓటుకు నోటు సంప్రదాయం కొనసాగుతుంది. సాధారణంగా ధనిక రాష్ట్రాలకన్నా పేద రాష్ట్రాల్లో ఓటుకు రేటు ఎక్కువ పలుకుతుంది. ‘నువ్వా, నేనా’ అన్నట్లు పోటీ ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భాల్లో కూడా రేటు పెరుగుతుంది. కర్ణాటకలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు మూడు వందల రూపాయలు పలగ్గా ఇప్పుడది రెండువేల రూపాయలకు చేరుకుంది. కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా, ఉత్కంఠంగా మారడమే. గత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం కర్ణాటకలో కనీస వేతనం 12,270 రూపాయలు. ఆ మొత్తంలో ఒక్క రోజు ఓటు వేస్తే 17 శాతం డబ్బులు ముడుతాయి. కర్ణాటకలో నిరుద్యోగం 2.6 శాతమే ఉన్నప్పటికీ రోజు కూలీ దొరకుతుందన్న గ్యారెంటీలేని జీవితాలు ఎన్నో. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా రోజుకు 236 రూపాయలే దొరకుతాయి. అది కూడా వందరోజులు మాత్రమే గ్యారంటీ. అలాంటి పరిస్థితుల్లో నోట్ల ప్రలోభానికి కాదు, నోట్ల ఒత్తిడికి ఎంత మందో గురవుతారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారుతుంటోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో గుండు గుత్తాగా 150 ఓట్లకు లక్ష రూపాయలు పలికింది. అంటే ఒక్కో ఓటుకు 666.66 రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని ఆ ఎన్నికల్లో సీతాపూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షెవాలీ మిశ్రా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలికిన మూడు వందల రూపాయలతో పోలిస్తే 666 రూపాయలు రెండింతలకన్నా ఎక్కువ. యూపీలో ఇప్పుడు కనీస వేతనం నెలకు 7,613 రూపాయలే. అంటే, కర్ణాటకకంటే 4,657 రూపాయలు తక్కువ. యూపీలో నిరుద్యోగం శాతం కూడా 5.5. కర్ణాటకకన్నా 2.9 శాతం ఎక్కువ. పంజాబ్‌లో 2009లో ఓటు రేటు ప్రత్యక్ష సాక్షిగా మాజీ జర్నలిస్ట్ మన్‌ప్రీత్ రంధావ రాసిని వ్యాసం కూడా ఇక్కడ గమనార్హమే. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్, బటిండా నియోజకవర్గంలోని మన్సా పోలింగ్ కేంద్రానికి ఆయన ఓటు వేయడానికి వెళ్లారు. ఆయన వద్దకు ఓ అకాలీదళ్ కార్యకర్త వచ్చి ఓటువేస్తే ‘యూ విల్బీ పెయిడ్’ అని చెప్పారట. అప్పుడు అకాలీదళ్ తరఫున హరిసిమ్రాట్ కౌర్ బాదల్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున రణిందర్ సింగ్ పోటీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కుమారుడే రణిందర్ సింగ్. ఓటు వేసిన తర్వాత అకాలీదళ్ కార్యకర్త చెప్పిన ఓ అతిపెద్ద భవనం వద్దకు వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు, ఓటువేసినట్లు సిరా మరక చూపి ఓటర్లు డబ్బులు తీసుకోవాలట. అక్కడ మనిషికి 200 రూపాయలు ఇచ్చారట. ఆ విషయాన్ని ఆయన అప్పుడు పనిచేస్తున్న ‘హిందుస్థాన్ టైమ్స్’లో రాసినా అధికారులెవరూ ఆ భవనంపై దాడి చేయలేదట. ఎలాంటి చర్యా తీసుకోలేదట. ఆమ్ ఆద్మీ పోరాటం అవినీతికి వ్యతిరేకంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటుకు నోటు సంప్రదాయంపై పరోక్ష యుద్ధం చేసింది. ‘ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ కేజ్రివాల్ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటువేసే వారు అవినీతి పరులని అలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోవడం అవినీతి కిందకు రాదని, పైగా వారికి బుద్ధి చెప్పిట్లు అతుందన్నది అప్పుడు ఆయన వాదన. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పిలుపు ఏ మేరకు ప్రభావం చూపించిందోగానీ, 2015 ఎన్నికల్లో అద్భుత ప్రభావాన్ని చూపించింది. 70 అసెంబ్లీ సీట్లకుగాను ఆయన పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అనుసరించి బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కొన్ని పార్టీలు గురద్వార్లకు, ఆలయాలకు ఓటర్లను తీసుకెళ్లి అక్కడే డబ్బులు పంచి ఒట్టు వేయించుకున్నారు. గుళ్లూ గోపురాల వద్దకు రావడానికి ఇష్టపడని ఓటర్ల వద్దకు నాయకులే వెళ్లి పవిత్ర గ్రంధాల మీద, దేవుళ్ల పటాలపై ఒట్లు వేయించుకున్నారు. ఓటుకు నోటు ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కువ వరకు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు, మధ్యతరగతిలో ఓ మోస్తారు మంది ఓటుకు నోటు ఒత్తిడికి గురవుతున్నారు. ‘ఇక మా జీవితాలు ఇంతే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మా బతుకులు మారవు. మా కూడుకు మేము కష్టపడాల్సిందే’ అన్న నిర్లిప్తత పెరిగిన పేదలు, ‘ ఏ రాజకీయ పార్టీ, ఎవరొచ్చినా పెద్దగా మారేదేముందీ! ఎలాగైనా మన బతుకుల్ని మనం బాగుచేసుకోవచ్చు. మనకుండే నెట్వర్క్ మనకు ఉండనే ఉంటుంది’ అని భావించే మధ్యతరగతి మనుషులు ‘నోటకు ఓటు’ వేస్తున్నారు. -
చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ షాక్
అహ్మదాబాద్: నీ జన్‌ధన్ ఖాతాలో రూ. 10 లక్షలకు లెక్క చెప్పాలంటూ రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిచ్చింది. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని మన్షుక్ మక్వాన(55)కు ఈ నోటీసులొచ్చాయి. జన్‌ధన్ ఖాతాలో అంత మొత్తం ఎలా వచ్చిందో చెప్పాలని నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొంది. నా జీవితంలో ఎప్పుడూ అంత డబ్బు చూడలేదని, రోజంతా కష్టపడితే రూ. 200 లు వస్తాయని, అలాంటప్పుడు అంత మొత్తం ఎలా డిపాజిట్ చేస్తానని మన్షుక్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
జన్‌ధన్ ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు
-
ఖాతాలోకి రూ. 99,99,99,394
ఘజియాబాద్: తనకు తెలియకుండానే తన జన్‌ధన్∙ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు వచ్చి చేరాయంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఘజియాబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ కొన్ని రోజుల క్రితం కొంత నగదును విత్‌డ్రా చేసేందుకు స్థానిక ఏటీఎంకు వెళ్లింది. అక్కడ తన ఖాతాలో రూ. 99,99,99,394 ఉండటం చూసి ఆశ్చ్యర్యానికి గురై.. పక్కన నిల్చున్న వ్యక్తిని అడిగి మరోసారి రూఢీ చేసుకుంది. మరో రెండు ఏటీఎంలలోనూ బ్యాలన్స్‌ను చెక్ చేసింది. చివరకు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అనంతరం ఖాతా ఉన్న బ్యాంక్ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. వారు పట్టించుకోకపోవడంతో తన భర్త సాయంతో పీఎంఓకు ఫిర్యాదు చేసింది. -
23 శాతం జన్‌ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు రాగా, ప్రతీ ఐదు ఖాతాల్లో ఒకటి (23 శాతం) ఇప్పటికీ సున్నా నిల్వలతోనే కొనసాగుతోంది. డీమోనిటైజేషన్ అనంతరం 30 రోజుల్లో జన్‌ధన్ ఖాతాల్లో రూ.29,000 కోట్లు జమ అయ్యాయి. దీంతో జన్‌ధన్ ఖాతాలన్నింటిలో డిపాజిట్ల విలువ డిసెంబర్ 7తో ముగిసిన వారానికి రూ.74,610 కోట్లకు పెరిగింది. తొలుత ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతూ రాగా, ఆ తర్వాత ఆ స్థాయిలో జమలు లేకపోవడం గమనార్హం. జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో నగదు జమలను గమనించిన ప్రభుత్వం నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఖాతాదారులపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరించిన విషయం విదితమే. నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఐటీ చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఈ హెచ్చరికలు ఫలించినట్టు తెలుస్తోంది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు జన్‌ధన్ పథకాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు. అదే సమయంలో గరిష్టంగా రూ.50వేలకు మించి డిపాజిట్ చేయడానికి కూడా అనుమతి ఉండదు. మొత్తం మీద 25.68 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో నవంబర్ 23వ తేదీ నాటికి ఉన్న నిల్వలు రూ.72,834 కోట్లు కాగా, డిసెంబర్ 7 నాటికి రూ.74,610 కోట్ల స్థాయికి చేరాయి. -
ప్రతీ ఒక్కరికి జన్‌ధన్ ఖాతా..
జైనథ్ : బ్యాంకు ఖాతాలు లేని ప్రతి ఒక్కరు జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ఎస్బీఐ ఆదిలాబాద్ టౌన్ బ్రాంచ్ బిజినెస్ కరస్పాండెంట్ పవార్ అంబాజీ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని నిరాల గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన 60మంది కాంట్రాక్టు కూలీలకు జీరో బ్యాలెన్‌సతో జనధన్ ఖాతాలు తెరవడానికి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వరకు ఏర్పాటు చేస్తున్న కొత్త కరెంట్ లైన్ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు ఖాతాలు తెరవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అయితే వీరందరికి కూడ వారం రోజుల్లో బ్యాంకు ఖాతతో పాటు దేశంలో ఎక్కడైన చెల్లుబాటు అయ్యేలా రూపే డెబిట్ కార్డులను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాత, కార్డులు తప్పనిసరిగా మారడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. -
జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ
► నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ.150 కోట్లు డిపాజిట్? ► గ్రామీణులకు ఎరవేస్తున్న నేతలు, వ్యాపారస్తులు ► ఖాతాలపై ఆర్బీఐ, ఆదాయపు పన్నుశాఖ దృష్టి తిరుపతి క్రైం: జన్‌ధన్ ఖాతాలకు భారీగా డబ్బులు జమవుతున్నాయి. మొన్నటి వరకు ఇన్ యాక్టివ్‌లో ఉన్న అకౌంట్లు ఇప్పుడు యాక్టివేషన్‌లోకి వచ్చాయి. 500 రూపాయలు కూడా లేని చాలా ఖాతాల్లో ఇప్పుడు వేలు, లక్షలు వచ్చి పడుతున్నాయి! కేంద్ర ప్రభుత్వంరూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేసిన అనంతరం డబ్బులు వచ్చిపడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 19 రోజుల వ్యవధిలోని జిల్లాలోని జన్‌ధన్ ఖాతాలలో దాదాపు 150 కోట్ల రూపాయల పైచిలుకు డిపాజిట్ అయినట్లు సమాచారం. దీంతో ఆ ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖ, రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఏడాది క్రితం జిల్లాలో 6 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించారు. గతనెల వరకు ఈఖాతాలు నిర్వహించిన వారు 5శాతం వరకు కూడా లేరు. అరుుతే నోట్ల రద్దు అనంతరం జన్‌ధన్ ఖాతాలను వినియోగించడం గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో సైతం పెత్తందారులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, పేదల జన్‌ధన్ ఖాతాల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఖాతాల్లోకి భారీగా డబ్బు వచ్చిపడుతోందని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకుల వారీగా జన్‌ధన్ ఖాతాల్లో వస్తున్న డిపాజిట్లపై విచారణకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అనధికార సమాచారం వరకు జిల్లాలో సుమారు రూ.150 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు తెలిసింది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో డిపాజిట్లు చేరితే ఆదాయం పెరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీలు కట్ చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం లేదని తెలుస్తోంది. ఈ డబ్బులు ఖాతాదారులవేనా? ఇతరులు వేస్తున్నారా? అనే కోణంలో ఆర్బీఐ అధికారులు, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణులకు ఎర పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు బడాబాబులు, బడానేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు గ్రామనేతలు స్థానికులను పిలిపించుకుని ‘ఒక ఇంటికి లక్ష, రెండు లక్షలు ఇస్తాం..మీ ఖాతాల్లో మేము డబ్బులు వేస్తాం..వాటిని ఏడాది తరువాత మాకు ఇవ్వండి. . ఎలాంటి వడ్డీ అవసరం లేదు’ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో వాడుకల్లో లేని పేదల ఖాతాలకు డిమాండ్ వచ్చింది. జిల్లాలో 45 లక్షలకు పైగా ఎస్బీఐ ఖాతాలు ఉన్నారుు. వీటిల్లోనూ డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని తెలిసింది. కమీషన్ల జోరు బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చడంలో కమీషన్ల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. 10 లక్షలు రద్దయిన కరెన్సీ ఇస్తే 6 లక్షల నుంచి 7.50 లక్షల వరకు కరెన్సీ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లో భారీగా కొత్త కరెన్సీ దారి మరలించడం వల్లే బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతోందనే విమర్శలొస్తున్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. -
లెక్కచూపకుంటే 50 శాతం పన్ను
-
లెక్కచూపకుంటే 50 శాతం పన్ను
25 శాతం మొత్తానికి నాలుగేళ్ల లాకిన్ పరిమితి ► ఐటీ తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 90 శాతం పన్ను ► ఐటీ చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: రద్దైన పాత నోట్లతో డిపాజిట్ చేసిన మొత్తాలకు లెక్క చూపకపోతే కనిష్టంగా 50 శాతం పన్ను విధించనున్నారు. మిగిలిన మొత్తంలో సగం(25 శాతం) నాలుగేళ్ల వరకూ తీసుకోకుండా లాకిన్ పరిమితి పెట్టనున్నారు. ఈ మేరకు ఐటీ చట్టంలో మార్పులు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి డిసెంబర్ 30 వరకూ జమైన మొత్తాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. జన్‌ధన్ ఖాతాల్లో నల్లధనంపై గురి.. ఒకవేళ అప్రకటిత ఆదాయం ఐటీ తనిఖీల్లో పట్టుబడితే 90 శాతం పన్ను విధిస్తారు. ఐటీ చట్టంలో మార్పులకు గురువారంకేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు వారాల్లో రూ. 21 వేల కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో జమైనట్లు ఐటీ గుర్తించింది. ఇందులో అత్యధిక శాతం నల్లధనంగా అనుమానిస్తున్నారు. అప్రకటిత ఆదాయం పట్టుబడితే భారీగా పన్ను, 200 శాతం పెనాల్టీ విధిస్తామని ఇంతవరకూ ఐటీ శాఖ చెపుతున్నా... న్యాయపరంగా అది వీలుకాదనే నేపథ్యంలో తాజా సవరణలు తీసుకొస్తున్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఐటీ చట్టంలో సవరణలు ఆమోదం పొందేలా ప్రయత్నాల్ని కేంద్రం ముమ్మరం చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం సోమవారం లేదా మంగళవారం ఐటీ చట్టంలో సవరణలు పార్లమెంట్ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. లెక్కలు చూపని, అప్రకటిత డిపాజిట్లపై అదనపు పన్నుల ద్వారా వచ్చే నగదును గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించేలా నిధి ఏర్పాటు చేస్తారని సమాచారం. మరో మూణ్నెల్లు నగదు కొరతే: పనగరియ ముంబై: నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మూడునెలల పాటు నగదు లభ్యత తక్కువగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియ తెలిపారు. ‘ వ్యవస్థలోకి నగదును ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గరిష్టంగా మూడునెలల్లో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నాన’న్నారు. ఐనాక్స్లోను విత్‌డ్రా సౌకర్యం బిగ్ బజార్ అనంతరం మల్టీప్లెక్స్ విభాగం ఐనాక్స్ తన థియేటర్ల వద్ద డెబిట్ కార్డులతో రూ. 2 వేల నగదు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని, శుక్రవారం నుంచే నగదు ఇస్తున్నామని తెలిపింది. బంగారంపై పరిమితి ప్రతిపాదన లేదు వ్యక్తుల వద్ద బంగారంపై పరిమితి పెట్టాలన్న ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నారుు. ఒక వ్యక్తి వద్ద ఎంత మేర బంగారం ఉండాలన్న దానిపై కేంద్రం పరిమితులు పెట్టనుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆ శాఖ శుక్రవారం స్పష్టత నిచ్చింది. -
భవిష్యత్ నగదు రహితమే
కలెక్టర్ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం అర్బన్: భవిష్యత్ నగదు రహిత కార్యకలాపాలదేనని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నా రు. ఆంధ్రా బ్యాంకు జోనల్ కార్యాలయంలో మం గళవారం ఆంధ్రా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ బిజినెస్ కరస్పాం డెంట్ల పాత్ర ప్రస్తుతం క్రియాశీలకమన్నారు. ప్రజ ల్లో నగదు రహిత కార్యకలాపాలపై అవగాహన కలిగించేందుకు, వారి కార్యకలాపాల్లో తోడ్పాటు ను అందించేందుకు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. బ్యాంకులు కొత్తగా నియామకాలు చేపట్టనవసరం లేదనే విధంగా సేవలు అందించాలని ఆయన కోరారు. అధికంగా వ్యాపారం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర బ్యాంకర్ల స మావేశంలో ప్రతిపాదిస్తామని అన్నారు. నగదు ర హిత సమాజం దిశగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు ఆధార్, బయోమెట్రిక్ అ నుసంధానించిన జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ. 33 కోట్లను పింఛన్లుగా ప్రతి నెలా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని దాదాపు 400 మీసేవ కేంద్రాలను, 2099 చౌకధరల దుకాణాల డీలర్లను బిజి నెస్ కరస్పాండెంట్లుగా చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత స్థితికి శ్రీరారం చుట్టామని చెప్పారు. రైతు బజార్లలో స్వైప్ మెషీన్లను, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు. మినీ ఏటీఎంల నుంచి రూ. 500 వరకు 50, 100 రూపాయల నోట్లను పొందవచ్చని చెప్పారు. సీతంపేటలో సోమవారం ప్రారంభించామని, ప్రతి సోమవారం నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ బిల్లులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో అనుసంధానం చేసి చెల్లింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలోను మైక్రో ఏటీఎంలను ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం విక్రయాల వద్ద స్వైప్ మెషీన్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని చెప్పారు. తద్వారా ఎంఆర్పీ ధరలకు విక్రరుుస్తారని, బెల్టు షాపుల నివారణకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ప్రతి వ్యవహారం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని అన్నారు నగదు రహిత గ్రామాలు జిల్లాలోని 38 మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నగదు రహిత గ్రామంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు శాఖలు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి నగదు రహిత కార్యాకలాపాల దిశగా తీసుకువెళ్లడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. జనవరి 1 నుంచి సంపూర్ణ నగదు రహిత గ్రామాలుగా ఇవి ఆవిర్భవించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ బీఆర్కే రావు, సహాయ జనరల్ మేనేజర్ కె.రాజేంద్రకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ పి. వెంకటేశ్వరశాస్త్రి, ఆర్థిక సలహాదారులు ఆర్ఆర్ఎం పట్నాయక్, కె. గిరిజా శంకర్, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.