
23 శాతం జన్‌ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు రాగా, ప్రతీ ఐదు ఖాతాల్లో ఒకటి (23 శాతం) ఇప్పటికీ సున్నా నిల్వలతోనే కొనసాగుతోంది. డీమోనిటైజేషన్ అనంతరం 30 రోజుల్లో జన్‌ధన్ ఖాతాల్లో రూ.29,000 కోట్లు జమ అయ్యాయి. దీంతో జన్‌ధన్ ఖాతాలన్నింటిలో డిపాజిట్ల విలువ డిసెంబర్ 7తో ముగిసిన వారానికి రూ.74,610 కోట్లకు పెరిగింది. తొలుత ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతూ రాగా, ఆ తర్వాత ఆ స్థాయిలో జమలు లేకపోవడం గమనార్హం.
జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో నగదు జమలను గమనించిన ప్రభుత్వం నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఖాతాదారులపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరించిన విషయం విదితమే. నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఐటీ చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఈ హెచ్చరికలు ఫలించినట్టు తెలుస్తోంది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు జన్‌ధన్ పథకాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో గరిష్టంగా రూ.50వేలకు మించి డిపాజిట్ చేయడానికి కూడా అనుమతి ఉండదు. మొత్తం మీద 25.68 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో నవంబర్ 23వ తేదీ నాటికి ఉన్న నిల్వలు రూ.72,834 కోట్లు కాగా, డిసెంబర్ 7 నాటికి రూ.74,610 కోట్ల స్థాయికి చేరాయి.