రద్దైన పాత నోట్లతో డిపాజిట్ చేసిన మొత్తాలకు లెక్క చూపకపోతే కనిష్టంగా 50 శాతం పన్ను విధించనున్నారు.
25 శాతం మొత్తానికి నాలుగేళ్ల లాకిన్ పరిమితి
► ఐటీ తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 90 శాతం పన్ను
► ఐటీ చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రద్దైన పాత నోట్లతో డిపాజిట్ చేసిన మొత్తాలకు లెక్క చూపకపోతే కనిష్టంగా 50 శాతం పన్ను విధించనున్నారు. మిగిలిన మొత్తంలో సగం(25 శాతం) నాలుగేళ్ల వరకూ తీసుకోకుండా లాకిన్ పరిమితి పెట్టనున్నారు. ఈ మేరకు ఐటీ చట్టంలో మార్పులు చేసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి డిసెంబర్ 30 వరకూ జమైన మొత్తాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
జన్‌ధన్ ఖాతాల్లో నల్లధనంపై గురి.. ఒకవేళ అప్రకటిత ఆదాయం ఐటీ తనిఖీల్లో పట్టుబడితే 90 శాతం పన్ను విధిస్తారు. ఐటీ చట్టంలో మార్పులకు గురువారంకేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు వారాల్లో రూ. 21 వేల కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో జమైనట్లు ఐటీ గుర్తించింది. ఇందులో అత్యధిక శాతం నల్లధనంగా అనుమానిస్తున్నారు. అప్రకటిత ఆదాయం పట్టుబడితే భారీగా పన్ను, 200 శాతం పెనాల్టీ విధిస్తామని ఇంతవరకూ ఐటీ శాఖ చెపుతున్నా... న్యాయపరంగా అది వీలుకాదనే నేపథ్యంలో తాజా సవరణలు తీసుకొస్తున్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఐటీ చట్టంలో సవరణలు ఆమోదం పొందేలా ప్రయత్నాల్ని కేంద్రం ముమ్మరం చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం సోమవారం లేదా మంగళవారం ఐటీ చట్టంలో సవరణలు పార్లమెంట్ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. లెక్కలు చూపని, అప్రకటిత డిపాజిట్లపై అదనపు పన్నుల ద్వారా వచ్చే నగదును గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించేలా నిధి ఏర్పాటు చేస్తారని సమాచారం.
మరో మూణ్నెల్లు నగదు కొరతే: పనగరియ
ముంబై: నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మూడునెలల పాటు నగదు లభ్యత తక్కువగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియ తెలిపారు.
‘ వ్యవస్థలోకి నగదును ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గరిష్టంగా మూడునెలల్లో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నాన’న్నారు.
ఐనాక్స్‌లోను విత్‌డ్రా సౌకర్యం
బిగ్ బజార్ అనంతరం మల్టీప్లెక్స్ విభాగం ఐనాక్స్ తన థియేటర్ల వద్ద డెబిట్ కార్డులతో రూ. 2 వేల నగదు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని, శుక్రవారం నుంచే నగదు ఇస్తున్నామని తెలిపింది.
బంగారంపై పరిమితి ప్రతిపాదన లేదు
వ్యక్తుల వద్ద బంగారంపై పరిమితి పెట్టాలన్న ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నారుు. ఒక వ్యక్తి వద్ద ఎంత మేర బంగారం ఉండాలన్న దానిపై కేంద్రం పరిమితులు పెట్టనుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆ శాఖ శుక్రవారం స్పష్టత నిచ్చింది.