న్యూఢిల్లీ: ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక అన్ని బ్యాంకులకూ అనుమతి లభించనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బ్యాంకులు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలు, మార్గదర్శకా లకు అనుగుణంగానే కొత్త బ్యాంకులకు ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆర్‌బీఐకీ ప్రభుత్వం ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్లు వివరించారు. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న పొదుపు పథకాల నిర్వహణ వంటి కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రైవేటు దిగ్గజ బ్యాంకులు ఆయా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఆర్థికమంత్రి తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే...
►ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా పలు బ్యాంకులకు ఇప్పటికే అనుమతి నివ్వడం జరిగింది. ఇలాంటి అనుమతులకోసం ఆర్‌బీఐని సంప్రదించే కొత్త బ్యాంకులూ ఇందుకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేటర్‌గా ఆర్‌బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి పటిష్ట నియమ నిబంధనలను అమలుచేస్తోంది.
►ఇటువంటి అనుమతులను ప్రైవేటు బ్యాంకులకు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఏమీ ఉండబోదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులూ ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ సేవల విషయంలో కొందరు కస్టమర్లు ప్రైవేటు బ్యాంకుల నుంచీ సేవలను పొందుతున్నారు.
►ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. వ్యాపారాలు పెరుగుతున్నాయి. కొందరు కస్టమర్లు కేవలం ప్రైవేటు బ్యాంకులనే సంప్రదించే పరిస్థితి నెలకొంటోంది. వ్యాపార నిర్వహణలో ఎటువంటి అడ్డంకులూ ఏర్పడకుండా చూడ్డం ఇక్కడ ప్రధానాశం. కస్టమర్లు అందరికీ అన్ని బ్యాంకుల్లో అన్ని సేవలూ లభించాలి.
సమ్మె నేపథ్యంలో ప్రకటన!
బ్యాంకింగ్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ఒకపక్క సమ్మె జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. రూ.1.75 లక్షల కోట్ల సమీకరణకు ఉద్దేశించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కేంద్రం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసింది.
పలు విలీన చర్యల నేపథ్యంలో 2017 మార్చిలో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కు పడిపోయింది. 2019లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసింది. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు అనుబంధ బ్యాంకులను అలాగే భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేసింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేసింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌తో విలీనంకాగా, అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌తో కలిసిపోయింది. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.
పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ ప్రాధాన్యత: ఠాకూర్
రాజ్యసభలో అడిగిన మరో ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానమిస్తూ, బ్యాంకులు రెండు రకాల వ్యాపారాలను నిర్వహిస్తాయని తెలిపారు. ఇందులో ఏజెన్సీ కమిషన్‌కు సంబంధించినది ఒకటని వివరించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆదాయపన్ను వసూళ్లు, చెల్లింపులు అలాగే పెన్షన్ చెల్లింపులు ఈ పరిధిలోకి వస్తాయని వివరించారు. ఇక ఆర్‌బీఐ నిర్దేశించిన కార్యకలాపాల నిర్వహణ బ్యాంకింగ్ నిర్వహించే వ్యాపార కార్యకలాపాల్లో మరొకటని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలు, బ్యాంకింగ్ బిజినెస్ వంటి ఏజెన్సీ కమిషన్ పరిధిలోకి రాని అంశాలని ఈ సందర్భంగా వివరించారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. 2000లో మొత్తం డిపాజిట్లలో ప్రైవేటు రంగం వాటా 12.63 శాతంగా ఉండేదని, ఇప్పుడు ఈ వాటా 30.35 శాతానికి చేరిందని వివరించారు. ఇక ఇదే సమయంలో రుణాల విషయంలోనూ ప్రైవేటు రంగం బ్యాంక్ వాటా 12.56% నుంచి 36 శాతానికి చేరిందని తెలిపారు.
ఇక ప్రాధాన్యతా రంగానికి రుణాల విషయానికి వస్తే ప్రైవేటు రంగ బ్యాంకింగ్ వాటా రూ.12.72 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్న ఠాకూర్, ఈ విభాగానికి మొత్తం రుణాల్లో ఇది దాదాపు 50 శాతానికి చేరువలో ఉందని వివరించారు. ఇక కోవిడ్–19 సమయంలో ప్రభుత్వ అత్యవసర రుణ హామీ పథకంలో ప్రైవేటు బ్యాంకింగ్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ మంజూరీలు రూ.95,261 కోట్లని ఆయన తెలిపారు. పథకం కింద మొత్తం రుణ మంజూరీలో ఇది 38.22 శాతంగా వివరించారు. కాగా ప్రైవేటు రంగ బ్యాంకింగ్ వాటా 51.5 శాత మని పేర్కొన్న మంత్రి ఈ విలువను రూ.1,28, 297 కోట్లుగా వివరించారు. ప్రైవేటు రంగం ప్రాధాన్యత ఏ స్థాయికి పెరిగిందన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, వ్యాపార నిర్వహణలో అడ్డంకులు లేకుండా చూడ్డం, సమాన అవకాశాల కల్పన వంటి కారణాలతోనే ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీనివల్ల పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment