
రవీందర్ టక్కర్
వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో అయిన రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల సర్వీసు కాలంలో ఎటువంటి వేతనం చెల్లించకూడదనే ప్రతిపాదనను కంపెనీ తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో అయిన రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల సర్వీసు కాలంలో ఎటువంటి వేతనం చెల్లించకూడదనే ప్రతిపాదనను కంపెనీ తీసుకొచ్చింది. టక్కర్‌కు సంబంధించిన ప్రయాణ, బస, వినోద తదితర అన్ని రకాల ఖర్చులను మాత్రం కంపెనీ భరిస్తుంది. అదే విధంగా బోర్డు సమావేశాలు, ఇతర కమిటీల సమావేశాలకు పాల్గొన్న సమయంలోనూ ఎటువంటి ఫీజులు చెల్లించదు.
ఈ మేరకు టక్కర్ నియామకం సహా ఇతర ప్రతిపాదనలకు ఈ నెల 20న నిర్వహించే కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనుంది. ఈ వివరాలను వాటాదారులకు ఇచ్చిన నోటీసులో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. బాలేష్ శర్మ ఆకస్మిక రాజీనామాతో రవీందర్ టక్కర్‌ను ఎండీ, సీఈవోగా మూడేళ్ల కాలానికి కంపెనీ నియమించుకున్న విషయం గమనార్హం. 2019 ఆగస్ట్ 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. బాలేష్‌శర్మకు మాత్రం ఆయన పదవీ కాలంలో రూ.8.59 కోట్ల వేతనాన్ని కంపెనీ చెల్లించింది.
చదవండి: వొడాఫోన్ కొత్త ‘ఐడియా’