ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కస్టమర్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇటీవల కేవైసీ నిబంధనలకు సంబంధించి ఆర్‌బీఐ అధికారులు ఫిన్‌టెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఆర్‌బీఐ గతంలో వెల్లడించిన నిబంధనల్లో ఎలాంటి మార్పలు లేవని స్పష్టం చేశారు.
ఆఫ్‌లైన్ ఆధార్ ధ్రువీకరణ, సెంట్రలైజ్డ్ కేవైసీ, డిజిలాకర్ వంటి అన్ని డాక్యుమెంట్ సేకరణ ప్రక్రియలతో పాటు ఫిన్‌టెక్ కంపెనీలు డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో భాగంగా వీడియో కేవైసీని పాటించాలని ఆర్‌బీఐ తెలిపింది. గతంలో వీడియో కేవైసీ తప్పనిసరనే నిబంధనేదీ లేదు. కానీ ఇటీవల ఆర్‌బీఐ ఫిన్‌టెక్ కంపెనీల కస్టమర్ కేవైసీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో తప్పకుండా వీడియో కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని సడలించాలని కంపెనీ ప్రతినిధులు ఆర్‌బీఐతో చర్చలు జరిపారు. కానీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కచ్చితంగా అన్ని ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?
పీర్-టు-పీర్(ఆన్‌లైన్‌లో నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి అప్పు తీసుకోవడం) రుణాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్ కంపెనీలు కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలనే వాదనలున్నాయి. ఈ స్టార్టప్‌లపై ఆర్‌బీఐ మరిన్ని నిబంధనలు విధించే వీలుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా, పీ2పీలో అప్పు తీసుకుని చెల్లించకుండా డీఫాల్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment