ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో తొలుత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 355 పాయింట్లు జంప్‌చేసి 40,538ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 11,918 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,543 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. పాలసీ నిర్ణయాలలో భాగంగా ఆర్‌బీఐ గృహ రుణాలపై రిస్క్ వెయిట్స్‌ను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. వ్యక్తిగత గృహ రుణాల విషయంలో రుణ పరిమాణం, రుణ విలువ తదితర అంశాల ఆధారంగా వివిధ రిస్క్ వెయిట్స్ అమలుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
బ్యాంక్స్ స్పీడ్
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ 2.25 శాతం పుంజుకోగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్, బజాజ్ ఫిన్, శ్రీ సిమెంట్, బీపీసీఎల్, ఐవోసీ, టాటా స్టీల్ 3.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, గ్రాసిమ్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో,టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, టీసీఎస్ 1.6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఫైనాన్స్ జోరు
డెరివేటివ్స్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్, ఐబీ హౌసింగ్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఇండిగో, బంధన్ బ్యాంక్, హావెల్స్, మైండ్‌ట్రీ, యూబీఎల్, జిందాల్ స్టీల్ 10-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్, ఐజీఎల్, టాటా కన్జూమర్, బాలకృష్ణ, బెర్జర్ పెయింట్స్, గ్లెన్‌మార్క్, వోల్టాస్, ముత్తూట్ ఫైనాన్స్ 2.7-1.27 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1113 లాభపడగా.. 1087 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment