ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుండి బలపడిన సెంటిమెంటుతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడుతీశాయి. సెన్సెక్స్ 504 పాయింట్లు జంప్‌చేసింది. వెరసి 40,000 పాయింట్ల మైలురాయి ఎగువన 40,261 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 144 పాయింట్లు జమ చేసుకుని 11,813 వద్ద నిలిచింది. ప్రపంచ దేశాల పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు జోష్ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నదని అభిప్రాయపడ్డారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,355 వరకూ ఎగసింది. ఒక దశలో 39,953 దిగువకూ చేరింది. ఇక నిఫ్టీ 11,836 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,723 వద్ద కనిష్టాన్ని చవిచూసింది.
దిగ్గజాల జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా, ఆటో రంగాలు 3.2-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే రియల్టీ 2.3 శాతం క్షీణించగా.. మీడియా 0.35 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, హిందాల్కో, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, హీరో మోటో, ఐషర్, ఎస్‌బీఐ లైఫ్, టైటన్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ 7-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యూపీఎల్ 7 శాతం పతనంకాగా.. ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్, నెస్లే, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎయిర్‌టెల్ 4-0.5 శాతం మధ్య క్షీణించాయి.
కేడిలా జూమ్
డెరివేటివ్ కౌంటర్లలో కేడిలా హెల్త్, జిందాల్ స్టీల్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, రామ్‌కో సిమెంట్, లుపిన్, ఆర్‌బీఎల్ బ్యాంక్ 6-2.5 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్ 9.2 శాతం పతనంకాగా.. ముత్తూట్, ఐడియా, సన్ టీవీ, వోల్టాస్, టాటా కెమికల్స్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, కాల్గేట్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,412 లాభపడగా.. 1,227 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 631 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment