సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పతనమై 38,980 వద్ద నిలిచింది. వెరసి 39,000 పాయింట్ల మార్క్ దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 88 పాయింట్ల వెనకడుగుతో 11,516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,235- 38,926 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,587- 11,499 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దీర్ఘకాలంపాటు నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అయితే టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి.
బ్లూచిప్స్ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ 1.7-0.7 శాతం మధ్య క్షీణించగా.. ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు 0.4-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, అదానీ పోర్ట్స్, ఇన్‌ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఐటీసీ, టాటా స్టీల్, ఆర్‌ఐఎల్ 4.3-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ 4.2 శాతం జంప్‌చేయగా.. హెచ్‌సీఎల్ టెక్, జీ, మారుతీ, ఇన్ఫోసిస్, హీరో మోటో, బీపీసీఎల్, గ్రాసిమ్, కోల్ ఇండియా 2.3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.
డెరివేటివ్స్‌లో
డెరివేటివ్ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్, అరబిందో, ఎన్‌ఎండీసీ, ఐబీ హౌసింగ్, రామ్‌కో సిమెంట్, ఐడియా, అశోక్ లేలాండ్, ఐడియా, పీవీఆర్, పెట్రోనెట్, బీవోబీ, ముత్తూట్, ఐసీఐసీఐ ప్రు, గ్లెన్‌మార్క్ 4.4-1.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్, కోఫోర్జ్, కేడిలా హెల్త్, మైండ్‌ట్రీ, ఏసీసీ, ఎస్‌ఆర్‌ఎఫ్, జూబిలెంట్ ఫుడ్, పిరమల్, బాలకృష్ణ, పేజ్, లుపిన్ 5.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1153 లాభపడగా.. 1574 నష్టాలతో నిలిచాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment