రోజంతా నేలచూపులకే పరిమితమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 38,194 వద్ద నిలవగా.. నిఫ్టీ 39 పాయింట్లు తక్కువగా 11,278 వద్ద స్థిరపడింది. సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు, యూఎస్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతనంతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 360 పాయింట్లు కోల్పోయి 38,000 పాయింట్ల దిగువకు చేరింది. మిడ్‌సెషన్‌కల్లా 37,935 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆపై కొంతమేర కోలుకుంటూ వచ్చి చివర్లో 38,253కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,298-11,185 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. టెక్ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ మార్కెట్లు 2.2-4.2 శాతం మధ్య పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
బ్యాంకులు బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 2 శాతం డీలాపడగా.. రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.6 శాతం మధ్య నీరసించాయి. అయితే ఫార్మా 2 శాతం పుంజుకోగా.. మీడియా, మెటల్ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, జీ, సిప్లా, ఆర్‌ఐఎల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్, హిందాల్కొ, యూపీఎల్, సన్ ఫార్మా, హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, ఎయిర్‌టెల్ 3.6- 1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్‌బీఐ, గెయిల్, బజాజ్ ఫిన్, యాక్సిస్, ఐవోసీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, బీపీసీఎల్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్‌ప్రాటెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ 4-1 శాతం మధ్య బోర్లా పడ్డాయి.
ఎస్కార్ట్స్ జూమ్
డెరివేటివ్స్‌లో కంకార్, శ్రీరామ్ ట్రాన్స్, భెల్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌పీసీఎల్, ఐడిఎఫ్‌సీ ఫస్ట్, ఐసీఐసీఐ ప్రు, ఎల్‌ఐసీ హౌసింగ్, నాల్కో, బీఈఎల్, జూబిలెంట్ ఫుడ్, ఆర్‌బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ 4-2 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ఎస్కార్ట్స్, అమరరాజా, బయోకాన్, ఎన్‌ఎండీసీ, అదానీ ఎంటర్, గ్లెన్‌మార్క్, లుపిన్, అరబిందో, వోల్టాస్, జీఎంఆర్, టొరంట్ ఫార్మా 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.8 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1796 నష్టపోగా.. 884 లాభాలతో నిలిచాయి.
ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇదే విధంగా గడిచిన శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment