ఫెడ్‌ హెచ్చరికలు- మార్కెట్లు డౌన్‌ | Market plunges on Federal reserve comments on economic recovery | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ హెచ్చరికలు- మార్కెట్లు డౌన్‌

Published Thu, Aug 20 2020 4:01 PM | Last Updated on Thu, Aug 20 2020 4:01 PM

Market plunges on Federal reserve comments on economic recovery - Sakshi

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలానికి ఆర్థిక రికవరీ అనిశ్చితిలో పడినట్లు యూఎస్‌ ఫెడ్‌ స్పష్టం చేయడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 394 పాయింట్లు పతనమై 38,220 వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 వద్ద నిలిచింది. ఆర్థిక రికవరీని కోవిడ్‌-19 దెబ్బతీస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ తాజాగా హెచ్చరించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. బుధవారం యూఎస్‌ మార్కెట్లు వెనకడుగు వేయగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు 2-1 శాతం మధ్య నీరసించాయి. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడినట్లు నిపుణులు తెలియజేశారు. ఫలితంగా 330 పాయింట్లు తక్కువగా 38,284 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ తదుపరి 38,156 వరకూ పతనమైంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,290 వరకూ జారింది. తదుపరి 11,361 వరకూ కోలుకుంది.  

మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ 1.3 శాతం క్షీణించగా.. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ఇతర రంగాలలో మీడియా 3.2 శాతం ఎగసింది. మెటల్‌ 1 శాతం, రియల్టీ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, విప్రో, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, ఇండస్‌ఇండ్‌, ఆర్‌ఐఎల్‌, అల్ట్రాటెక్‌, కొటక్‌ బ్యాంక్‌ 2.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎన్‌టీపీసీ 7 శాతం జంప్‌చేయగా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌  కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఐవోసీ, హిందాల్కో, హీరో మోటో 3.3-1 శాతం మధ్య బలపడ్డాయి.

సన్‌ టీవీ అప్‌
డెరివేటివ్స్‌లో సన్‌ టీవీ, టాటా పవర్‌, జీఎంఆర్‌, ఎంజీఎల్‌, పీఎఫ్‌సీ, ఐజీఎల్‌, ఈక్విటాస్‌, టీవీఎస్‌ మోటార్‌, టొరంట్‌ పవర్‌, వోల్టాస్‌, జిందాల్‌ స్టీల్, ఉజ్జీవన్‌ 8.4-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క ముత్తూట్‌, మదర్‌సన్‌ సుమీ, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పెట్రోనెట్‌ 5.5-2 శాతం మధ్య తిరోగమించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ 0.8 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1167 నష్టపోగా.. 1598 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 459 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 97 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,135 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 379 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement