గాన కోకిల, మెలోడి క్వీన్, భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం రోజున మరణించిన విషయం తెలిసిందే. లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజున సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది.
రివర్స్ రెపో రేటు.. పెరిగే అవకాశం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం మంళవారం జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సందర్భంలో వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు అని బార్‌క్లేస్ అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్‌లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్‌బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్‌క్లేస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment