
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు.
టెలివిజన్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు.
ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు.