దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందన్న అవగాహన పెరుగుతోంది. ఫలితమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గత కొన్నేళ్లలో పెరుగుతూ వస్తోంది. కాకపోతే మార్కెట్ పతనాల్లో సిప్ పెట్టుబడుల్లో కాస్త క్షీణత కనిపించడం సాధారణమే. తిరిగి మార్కెట్ల రికవరీతో పరిస్థితి మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీయండి, డెట్ ఫండ్స్ కానీయండి.. వాటిల్లో పెట్టుబడులు పెట్టేయడంతో పని పూర్తయినట్టు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో మన పెట్టుబడులను నిపుణులే నిర్వహిస్తుంటారు కనుక వాటి గురించి ప్రత్యేకంగా చూడాల్సినది ఏముంటుందని అనుకోవడం కూడా సరికాదు. తమ జీవిత లక్ష్యాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు తప్పకుండా క్రమానుగతంగా వాటి పనితీరును సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్జనా శక్తి పెరగడం, జీవిత అవసరాలు అధికం కావడం.. దీనికితోడు కాస్త రిస్క్ తీసుకుంటే మంచి రాబడులను ఈక్విటీల్లో సొంతం చేసుకోవచ్చన్న అవగాహనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విస్తృతం చేస్తోంది. అయితే, ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నప్పటికీ.. తమ పెట్టుబడులను తరచుగా సమీక్షించుకోవాలన్న విషయం వారికి తెలియడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం అంటే మీ పెట్టుబడులపై ఓసారి లుక్కేయడం కాదు. ఓ పథకంలో పెట్టుబడులపై లాభం లేదా నష్టం వచ్చిందా? అన్న దానికే పరిమితం కానే కాదు. మీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం అంటే అందుకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. పెట్టుబడులపై రాబడులు వస్తే ఉత్సాహంతో పొంగిపోయినట్టే.. నష్టాలు కనిపిస్తే అసంతప్తికీ లోనవుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలే చూపిస్తుంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం దండగని భావించి అమ్మేయడం మాత్రం సరికాదు. అదే సమయంలో మార్కెట్లు పతనమయ్యాయా? అన్నది చూడాలి. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో అదే సమయంలో రాబడుల తీరు ఎలా ఉందీ పరిశీలించాలి.
ఫండ్స్ స్కీమ్ విధానాల్లో మార్పులు జరిగాయా? అన్నది చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఎక్స్‌పెన్స్ రేషియో (ఫండ్స్ పెట్టుబడుల నిర్వహణకుగాను వసూలు చేసే చార్జీ), రిస్క్, స్కీమ్ సైజు, అస్సెట్ రేషియో, రిస్క్ అంశాలు మారిపోయాయా అన్న దానిపై దృష్టి సారించాలి. అంతేకాదు, ఇన్వెస్టర్ ఏ అంశాలను చూసి అయితే ఆ పథకాన్ని ఎంచుకున్నారో.. అనంతర కాలంలో ఆ అంశాల్లో మార్పులు వచ్చాయేమో పరిశీలించడం మర్చిపోవద్దు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మంచి రాబడుల తీరును (ఇతర పథకాలు, బెంచ్ మార్క్ కంటే మెరుగైన పనితీరు) చూపించే ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్కీమ్ ఉద్దేశాల్లో మార్పులు జరగకపోయి, ఇన్వెస్టర్ తాను ఏ అంశాలను అయితే మెచ్చి ఆ పథకాలను ఎంచుకున్నారో... అవేమీ మారనప్పుడు, కేవలం నష్టాలను చూపిస్తుంటే వాటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదన్నది నిపుణుల సూచన. కేవలం అద్భుత రాబడులనే చూసి పథకం ఎంచుకుంటే మాత్రం వాటిని ప్రత్యేకంగా సమీక్షించాల్సి ఉంటుంది. సమీక్ష ఏదైనా కానీయండి.. స్వల్ప కాలంలో రాబడుల తీరు నచ్చక ఆయా పథకాలను మార్చేస్తే పెట్టుబడులకు విజయం అందడం కష్టమేనని గుర్తించాలి.
మరీ ముఖ్యంగా తమ జీవిత లక్ష్యాల్లో మార్పులు సంభవించినప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం అవసరమని నిపుణుల సూచన. ఉదాహరణకు రిటైర్మెంట్ (60 ఏళ్లు వచ్చే నాటికి) కోసమని పెట్టుబడులు మొదలు పెట్టారనుకుంటే.. అనంతర కాలంలో 60 ఏళ్ల కంటే ముందుగానే రిటైర్ అవ్వాలని భావిస్తే అప్పుడు తప్పకుండా పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో సమతుల్యం కూడా అవసరం. పోర్ట్ ఫోలియోను వార్షికంగా ఒకసారి సమీక్షించుకోవడం వల్ల పన్నుల పరంగా ప్రయోజనం కూడా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు, వాటికి తగిన పెట్టుబడుల సాధనాల ఎంపిక అనేది ఎక్కువ మంది ఇన్వెస్టర్లలో కనిపించదన్నది వాస్తవం. కానీ, దీన్ని ఎక్కువ మంది అంగీకరించరు లేదా గుర్తించరు. అందుకే ఈ విషయంలో ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుర్తించాలి.
ఫండ్స్ పెట్టుబడులను సమీక్షిస్తున్నారా..
Published Mon, Aug 31 2020 6:04 AM | Last Updated on Mon, Aug 31 2020 8:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment