
image credits: ETH Zurich
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తెచ్చి ఇస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషులు రానున్న రోజుల్లో అద్భుతాలు చేయగలవని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇన్ని పనులు చేయబోతున్న మనిషినిపోలే రోబోల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ యూనివర్సిటీ పరిశోధకులు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రోబోటిక్ హ్యాండ్‌లను రూపొందించారు. ఇవి అచ్చం మనిషి చేతుల మాదిరిగానే ఎముకలు లిగమెంట్ల వంటి ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. పైగా వీటికి సాగే గుణం కూడా ఉందట. కాబట్టి లేజర్ స్కానింగ్ టెక్నాలజీ, రకరకాల పాలిమర్ల సాయంతో భవిష్యత్తులో మన చర్మాన్ని పోలిన మృదువైన రోబోలను తయారుచేయడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు.
ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
సంప్రదాయ పాలీఅక్రిలేట్లకు బదులుగా థియోలీన్‌తో చేసిన పాలిమర్లను వాడటంతో అవసరం మేరకు అవి సాగి, మళ్లీ యథాస్థితికి వస్తాయి. పైగా గట్టిగా కాకుండా మృదువుగా ఉండటంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి. సంప్రదాయ రోబోలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటితో కలిసి పనిచేసేటప్పుడు మనకి చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. కొత్తరకం రోబోలతో అలాంటివేవీ ఉండవు. పైగా వాటిని పట్టుకోవడానికీ సులభంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment