రోబోల దండు వచ్చేస్తోంది..! | tech companies introduce humanoid robots | Sakshi
Sakshi News home page

రోబోల దండు వచ్చేస్తోంది..!

Published Tue, Aug 20 2024 12:06 PM | Last Updated on Tue, Aug 20 2024 3:01 PM

tech companies introduce humanoid robots

రోబో సినిమా గుర్తుంది కదా. అందులో రజనీకాంత్‌ తయారు చేసిన ‘చిట్టీ’ అచ్చం మనిషిలాగే ఉంటూ, సొంతంగా ఆలోచిస్తూ పనులు చేస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అదో మాయగా అనిపించి ఉంటుంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచ కంపెనీలు హ్యుమనాయిడ్‌ రోబోల తయారీపై ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా చైనాకు చెందిన యూనిట్రీ సంస్థ జీ1 అనే హ్యుమనాయిడ్‌ రోబోను ఆవిష్కరించింది. జీ1 సొంతంగా డ్యాన్స్‌ చేస్తుంది. మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది. బ్యాలెన్స్‌ నియంత్రిస్తూ నడుస్తుంది. ఏదైనా ఎదురుపడితే అందుకు తగినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రోబో డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అదికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ జీ1 రోబోను కంపెనీ 16000 అమెరికన్‌ డాలర్ల(రూ.13.4 లక్షలు)కు విక్రయించనున్నట్లు ప్రకటించింది.

యూనిట్రీ సంస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెస్లా, ఫిగర్‌, బోస్టన్‌ డైనమిక్స్‌, సాంక్చురీ ఏఐ..వంటి ప్రముఖ కంపెనీలు హ్యుమనాయిడ్‌ రోబోలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే అందులో కొన్ని కంపెనీలు ప్రాథమికంగా రోబోలను ఆవిష్కరించాయి.

సముద్ర గర్భంలో నిఘా..

సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్‌ రోబోను అభివృద్ధి చేశారు.

టీ, కాఫీ చేసే యంత్రుడు

‘ఫిగర్‌.ఏఐ’ సంస్థ సౌత్‌కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్‌ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేద తీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్‌ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్‌ గతంతోనే వెల్లడించింది.

ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?

టెస్లా ఆప్టిమస్‌

భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్‌ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందని గతంలో ఇలాన్‌మస్క్‌ అన్నారు. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్‌లను విస్తారంగా వాడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్‌ రోబో ఒక్కో యూనిట్‌ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement