న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలు మొదలైనవి కాస్త సమస్యాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలకు చేసే ఎగుమతులను ఆపి ఉంచాలని ఎగుమతిదారులకు సూచించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్–జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న దానిపై వాణిజ్యంపై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. ఆ ప్రాంతంలో (రష్యా, ఉక్రెయిన్) వ్యాపార లావాదేవీల విషయంలో ఎగుమతిదారులు అప్రమత్తంగా ఉన్నారు‘ అని సహాయ్ వివరించారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 9.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
అటు రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు ఔషధాలను ఎగుమతి చేసే విషయంలో వేచి చూసే ధోరణి పాటిస్తున్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని .. ఆ ప్రాంతంలోని తమ ఉద్యోగుల క్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వర్గాలు తెలిపాయి. ‘ ఆయా దేశాలకు ఫార్మా ఎగుమతులపై ప్రస్తుతం ఆంక్షలేమీ లేవు. అయినప్పటికీ పరిస్థితులపై మరింత స్పష్టం వచ్చే వరకూ కాస్త వేచి చూడాలని భావిస్తున్నాం. అంతిమంగా యుద్ధ ఫలితంగా మాకు రావాల్సిన చెల్లింపులపై ప్రభావం పడకూడదు కదా‘ అని మరో ఫార్మా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు 181 మిలియన్ డాలర్లు, రష్యాకు 591 మిలియన్ డాలర్ల విలువ చేసే ఔషధాలు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి.
గోధుమలపరంగా అవకాశాలు..
ప్రస్తుత సంక్షోభంతో గోధుమల ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, ఎగుమతిదారులు వీటిని అందిపుచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా గోధుమల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా పావు భాగం పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా ఎగుమతి చేస్తోంది. ఈజిప్ట్ అత్యధికంగా ఏటా 4 బిలియన్ డాలర్లపైగా విలువ చేసే గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్‌ల వాటా 70 శాతం మేర ఉంటుంది. అలాగే టర్కీ, బంగ్లాదేశ్‌లు కూడా రష్యా నుంచి గోధుమలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు గానీ అమలైతే.. వివిధ దేశాలకు గోధుమలపరంగా దేశీ ఎగుమతిదారులకు అవకాశాలు లభించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment