న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది. ఉచిత సేవలకు మించి వినియోగదారులు అదనపు సేవలను వినియోగించినందుకు 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ₹345.84 కోట్లను ఎస్‌బీఐ వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి భగవత్ కరద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఆగస్టు 30, 2020 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం.. రూపే డెబిట్ కార్డు, యుపీఐ, యుపీఐ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్ మోడ్ లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత సేకరించిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, భవిష్యత్తు లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని బ్యాంకులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎమ్‌జెడివై) కింద తెరిచిన ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఎ) తెరిచిన వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. అలాగే, వీరు బ్యాంకు ఖాతాలలో ఎలాంటి కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం లేదు.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్‌బీడీఏ, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment