లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకం ఇది. గతంలో మిడ్‌క్యాప్ పథకంగా ఉండగా, సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో.. లార్జ్, మిడ్‌క్యాప్ పథకంగా మారింది. లార్జ్, మిడ్‌క్యాప్ మధ్య పెట్టుబడులను వర్గీకరిస్తుంది. బీఎస్‌ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడుల్లోనూ స్థిరత్వం ఉంటుంది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెడతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పెట్టుబడుల విధానం
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018, 2020 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. ఆ సమయంలో ఈక్విటీల్లో గరిష్ట పెట్టుబడులు 94–96 శాతం మధ్యే పరిమితం చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. స్టాక్స్‌ను కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు అందులో కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది.
రాబడులు
ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 25.66 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బీఎస్‌ఈ లార్జ్‌మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ రాబడులు కూడా ఇంచు మించు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల కాలంలో ఏటా 18 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 17.20 శాతం, పదేళ్లలో 21.83 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. బీఎస్‌ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్‌ఐతో పోలిస్తే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకంలోనే అధిక రాబడి ఉంది.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం 60–70 స్టాక్స్‌తో చక్కని వైవిధ్యాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం 67 స్టాక్స్ ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో 18,845 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 97.37 శాతాన్ని కేటాయించింది. నగదు, నగదు సమానాల్లో 2.63 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.58 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కేటాయింపులు అరశాతానికే పరిమితమయ్యాయి. వీలైనంత వరకు రిస్క్‌ను తగ్గించి, మెరుగైన, స్థిరమైన రాబడిని అందించే వ్యూహం ఈ పథకం పెట్టుబడుల వెనుక కనిపిస్తోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 28 శాతం కేటాయింపులను ఈ రంగం కంపెనీలకే కేటాయించింది. ఆటోమొబైల్ రంగ కంపెనీలకు 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 11.46 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment