
మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
మిడ్‌క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో అన్నీ మిడ్‌క్యాప్ కంపెనీలే ఉంటాయా? లేకుంటే లార్జ్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా ఉంటాయా? ఒక ఇన్వెస్టర్ ఈ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయవచ్చు? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను సూచించండి.
– చక్రవర్తి, విజయవాడ
మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను సాధారణంగా మిడ్ క్యాప్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. అయితే అన్ని ఫండ్స్ అలాగే ఉండాలని రూలేమీ లేదు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ మిడ్–క్యాప్ ఆపర్చునిటీ ఫండ్‌ను తీసుకుంటే, ఈ ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలో 30 శాతం వరకూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ పతనసమయాల్లో మిడ్‌క్యాప్ షేర్లు కూడా బాగా పతనమవుతాయి. మార్కెట్ క్షీణిస్తున్నప్పుడు వీటిని విక్రయించుకొని బయటపడడం కొంచెం కష్టమైన పనే. అందుకని మిడ్‌క్యాప్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్ కంపెనీలు ఉంటే, ఆ ఫండ్‌కు తగిన లిక్విడిటీ ఉంటుంది. తమ పోర్ట్‌ఫోలియోలో 70 శాతానికి పైగా మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మిడ్‌క్యాప్ ఫండ్స్‌గా పరిగణించవచ్చు. మిడ్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరోవైపు భారీగా నష్టపోయే అవకాశాలూ ఉంటాయి. ఒక ఫండ్ మేనేజర్...తన అనుభవంతో... భవిష్యత్తులో వృద్ధిచెందే అవకాశాలున్న మిడ్‌క్యాప్ కంపెనీలను గుర్తించగలుగుతారు. అందుకని ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా మిడ్‌క్యాప్ ఫండ్స్ ఉండాలి.. ఒక ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం నిధులను మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించవచ్చు. మీకు రిస్క్‌ను భరించే సామర్థ్యం అధికంగా ఉంటే 30–40 శాతం నిధులను మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి... మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్–క్యాప్ అపర్చునిటీస్ ఫండ్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, బీఎన్‌పీ పారిబా మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్‌సీడీలను పరిగణించవచ్చా?
–ప్రదీప్, విశాఖపట్టణం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లను పరిశీలించవచ్చు. ఇవి స్థిర ఆదాయాన్నిస్తాయి. అయితే వీటికి రిస్క్ వుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఎన్‌సీడీలను జారీ చేసిన కంపెనీ పనితీరుని బట్టే మీ రాబడులు ఉంటాయి. అందుకని చాలా మంది ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఒకటి లేదా రెండు కంపెనీల్లో చెప్పుకోదగిన మొత్తంలో ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం, వడ్డీ చెల్లింపుల్లో సదరు కంపెనీ విఫలమైన సందర్భంలో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకని రిటైర్మెంట్ నిధి కోసం ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మొత్తం నిధుల్లో కనీసం మూడో వంతు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు.
నా పోర్ట్‌ఫోలియోను నేను రీబ్యాలన్స్ చేసుకోగలను. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరముందా?
– నాగరాజ్, హైదరాబాద్
ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్‌డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మీ పోర్ట్‌ఫోలియోను మీరు రీ బ్యాలన్స్ చేసుకోగలిగినా సరే బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. సాధారణంగా రెండు ప్రయోజనాల కోసం బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మొదటిది బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో రీబ్యాలన్స్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఇలాంటి రీబ్యాలన్సింగ్ వల్ల పన్ను భారం ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు చేసినంత సమర్థంగా ఒక సాధారణ ఇన్వెస్టర్ (స్టాక్‌మార్కెట్ పట్ల తగిన అవగాహన ఉన్నప్పటికీ) పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్ చేయలేరు. ఇక రెండో ప్రయోజనం.. పన్ను ప్రయోజనాలు. ఒక బ్యాలన్స్‌డ్ ఫండ్ తన నిధుల్లో 35% వరకూ స్థిర ఆదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ, బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ట్యాక్స్ పరంగా ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే ఈక్విటీ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమ నిబంధనలు వర్తిస్తాయో, బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌కు కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయి. పన్ను అంశాల పరంగా ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ ఫండ్స్ ఉత్తమమైనవన్న విషయం తెలిసిందే. ఒక బ్యాలన్స్‌డ్ ఫండ్ తన నిధుల్లో 35 శాతం వరకూ స్థిర ఆదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది....కాబట్టి స్టాక్ మార్కెట్ పతనమైతే, ఈక్విటీ ఫండ్స్‌లా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్‌డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తా యని చెబుతుంటారు కదా ! కానీ చాలా ఫండ్స్ గత ఐదేళ్ల కాలం కంటే గత మూడేళ్ల కాలంలోనే అధిక రాబడులను ఇచ్చాయి. ఎందుకిలా?
– జాహ్నవి, బెంగళూరు
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వచ్చే మాట వాస్తవమే. అయితే మూడేళ్ల క్రితం స్టాక్‌మార్కెట్ కనిష్ట స్థాయిలో ఉంది. అదే ఐదేళ్ల కాలాన్ని తీసుకుంటే స్టాక్ మార్కెట్ ఒకింత మెరుగైన స్థాయిలో ఉంది. అందుకని చాలా ఫండ్స్ గత ఐదేళ్ల కాలం కంటే గత మూడేళ్ల కాలంలోనే అధిక రాబడులను ఇచ్చాయి. చాలా ఫండ్స్ గత మూడేళ్ల కాలంలో 25% వరకూ రాబడులనిస్తే, ఇవే ఫండ్స్ గత ఐదేళ్ల కాలంలో ఈ స్థాయిలో రాబడులను ఇవ్వలేదు. మ్యూచువల్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులు కాలాన్ని బట్టి మారుతుంటాయి. పదేళ్లు అంతకు మించిన కాలాన్ని(ఈ కాలం ఒక పూర్తి మార్కెట్ సైకిల్‌ను ప్రతిబింబిస్తుంది) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, వాటిపై రాబడులు నిలకడగా, అధికంగా ఉంటాయి.