ముంబై: ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్(ఈటీసీడీ) విభాగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో మరింత లిక్విడిటీ, గాఢత పెరిగేందుకు వీలుంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.
వీటిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పాలనా సంబంధ నిబంధనల సవరణలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్లు, రెపో లావాదేవీలకు సంబంధించిన లిమిటెడ్ పర్పస్ క్లయరింగ్ కార్పొరేషన్(ఎల్‌పీసీసీ)కు చెందిన ఎస్‌ఈసీసీ నియంత్రణల ప్రొవిజన్ల సవరణలకు సైతం ఓకే చెప్పింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)కి వార్షిక నివేదికను బోర్డు ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనుంది.
వ్యవసాయేతర విభాగం
అన్ని రకాల వ్యవసాయేతర కమోడిటీ డెరివేటివ్స్‌లోనూ ట్రేడింగ్ చేపట్టేందుకు ఎఫ్‌పీఐలను సెబీ బోర్డు అనుమతించింది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన ప్రామాణిక ఇండెక్సులలోనూ లావాదేవీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో నగదు ద్వారా సెటిల్ చేసుకునే కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు మాత్రమే ఎఫ్‌పీఐలకు వీలుంటుంది. ఈటీసీడీలో విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్లలో గాఢతను పెంచడంతోపాటు మరింత లిక్విడిటీకి అవకాశముంటుందని బోర్డు సమావేశం అనంతరం సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సరైన ధర నిర్ణయాని(ప్రైస్ డిస్కవరీ)కి సైతం వీలుంటుందని తెలియజేసింది.
ఈ విభాగంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్‌లు), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) తదితర కేటగిరీ–3 పెట్టుబడిదారులకు అనుమతి ఉంది. అర్హతగల విదేశీ సంస్థ(ఈఎఫ్‌ఈ)లు మార్గంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశీ ఫిజికల్ కమోడిటీల ట్రేడింగ్‌ను రద్దు చేయనుంది. అయితే ఈటీసీడీలలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా భారీ కొనుగోలు శక్తి కలిగిన ఎఫ్‌పీఐలను అనుమతించరు. తాజా నిర్ణయాల అమలు తేదీలను తదుపరి ప్రకటించనుంది. ప్రస్తుతం 10,000 ఎఫ్‌పీఐలు రిజిస్టరై ఉన్నప్పటికీ, పదో వంతు పార్టిసిపేట్ చేసినప్పటికీ మార్కెట్లు భారీగా విస్తరించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment