రెండు రోజుల వరుస స్టాక్ మార్కెట్ లాభాలకు గురువారం బ్రేక్‌పడింది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్ సూచీలు చివరకు నష్టపోయాయి. సేవల రంగం గణాంకాలు వరుసగా ఆరోనెలా నేలచూపులు చూడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు క్షీణించి 73.47కు చేరడం, ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 95 పాయింట్లు పతనమై 38,990 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 11,527 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఆరోనెలా అథఃపాతాళమే!
లాక్‌డౌన్ తొలగిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ, దేశీయ సేవల రంగం ఆగస్టులో వరుసగా ఆరో నెలా క్షీణించింది. జూలైలో 34.2గా ఉన్న ఐహెచ్‌ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్‌ఐ) ఆగష్టులో 41.8కు పెరిగింది. సేవల రంగం క్షీణత ఆగస్టులో తగ్గినప్పటికీ, పతన బాటలోనే (50 కంటే తక్కువగా ఉంటే క్షీణతగానే భావిస్తారు) ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
► నేడు(శుక్రవారం) జరిగే బోర్డ్ మీటింగ్‌లో నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 27 శాతం మేర లాభపడి రూ.12.56 వద్ద ముగిసింది. అమెజాన్, వెరిజాన్ సంస్థలు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనున్నాయన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి.
► టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.592ను తాకిన ఈ షేర్ చివరకు 5 శాతం లాభంతో రూ.578 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు ఎస్కార్ట్స్, ఎస్‌బీఐ కార్డ్స్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్,అదానీ గ్యాస్ తదితర షేర్లు కూడా ఆల్‌టైమ్ హైలను తాకాయి.
► ఐసీఐసీఐ బ్యాంక్ 2% నష్టంతో రూ.383 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయింది ఇదే.
► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, అదానీ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► 280కుపైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్ ఫ్యాషన్స్, డిష్ టీవీ వీటిలో ఉన్నాయి.
భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్
అమెరికా స్టాక్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆల్‌టైమ్ హైలను తాకిన నేపథ్యంలో ఇటీవల బాగా లాభపడిన టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరుగుతోందని. ఈ స్థాయి నష్టాలకు ఇదొక కారణమని విశ్లేషకులంటున్నారు. ఆపిల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ తదితర టెక్నాలజీ షేర్లన్నీ 5% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి 11.30కు డోజోన్స్, నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు 4–5% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోం ది. ఈ ప్రభావంతో నేడు మన మార్కెట్ భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలవుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment