
వరుసగా నాలుగు రోజులపాటు లాభాలతో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేడు (27న) అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ యథాతథంగా 11,553 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,554 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో వరుసగా నాలుగో రోజు బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. నేడు ఎఫ్‌అండ్‌వో ముగింపు కారణంగా మార్కెట్లలో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
సెన్సెక్స్-6 నెలల గరిష్టం
రెండు రోజులుగా కన్సాలిడేట్ అయినప్పటికీ బుధవారం వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు జంప్‌చేసి 39,074 వద్ద ముగిసింది. వెరసి ఆరు నెలల తదుపరి 39,000 పాయింట్ల మార్క్ ఎగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 11,550 వద్ద ముగిసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,488 పాయింట్ల వద్ద, తదుపరి 11,424 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,587 పాయింట్ల వద్ద, ఆపై 11,624 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,187 పాయింట్ల వద్ద, తదుపరి 22,960 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,547 పాయింట్ల వద్ద, తదుపరి 23,680 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.