నేడు(30న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 52 పాయింట్లు బలపడి 11,290 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,238 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అవసరమైతే మరోసారి సహాయక ప్యాకేజీకి వెనుకాడబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పష్టం చేశారు. క్యూ1తో పోలిస్తే పలు రంగాలలో జులై-సెప్టెంబర్‌లో ఆర్థిక వ్యవస్థ భారీ రికవరీని సాధించిన సంకేతాలు అందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా.. అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం డీలా పడ్డాయి. తద్వారా మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. అయితే డోజోన్స్, ఎస్‌అండ్‌పీ ఫ్యూచర్స్ లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఈ అంశాల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరికి ఫ్లాట్
మంగళవారం ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,973 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్‌చేసి 38,236ను తాకగా.. నిఫ్టీ 11,305 వరకూ ఎగసింది. అయితే ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 37,831 వద్ద, నిఫ్టీ 11,181 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చవిచూశాయి.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,167 పాయింట్ల వద్ద, తదుపరి 11,112 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,292 పాయింట్ల వద్ద, ఆపై 11,361 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,191 పాయింట్ల వద్ద, తదుపరి 20,970 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,722 పాయింట్ల వద్ద, తదుపరి 22,032 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment