నేడు(29న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 12 పాయింట్లు బలపడి 11,255 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,243 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5-2 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ కొంతమేర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వచ్చే వారానికి వాయిదా పడే అవకాశమున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)లోకి కొత్త సభ్యుల ఎంపిక కూడా దీనికి కారణం కానున్నట్లు తెలుస్తోంది!
బుల్ స్పీడ్
బుల్ ట్రేడర్లు కొనుగోళ్ల కొమ్ము విసరడంతో వరుసగా రెండో రోజు సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 38,000 పాయింట్ల మార్క్‌ను సైతం సులభంగా దాటేసింది. చివరికి 593 పాయింట్లు జమ చేసుకుని 37,982 వద్ద ముగిసింది. నిఫ్టీ 177 పాయింట్లు జంప్‌చేసి 11,227 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,036 వద్ద గరిష్టాన్ని తాకగా.. నిఫ్టీ 11,239 వరకూ ఎగసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,138 పాయింట్ల వద్ద, తదుపరి 11,049 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,278 పాయింట్ల వద్ద, ఆపై 11,328 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,244 పాయింట్ల వద్ద, తదుపరి 20,823 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,898 పాయింట్ల వద్ద, తదుపరి 22,130 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment