న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవోలు) జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం నుంచి (ఈ నెల 4న) విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయోగ్నస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోలు మొదలయ్యాయి. తొలిరోజే వీటికి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల నుంచి పూర్తి చందాలు (సబ్‌స్క్రయిబ్) వచ్చాయి.
దేవయాని ఇంటర్నేషనల్
కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కోస్టాకాఫీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించే దేవయాని ఇంటర్నేషనల్ ఇష్యూకు తొలిరోజు 30,26,56,860 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఆఫర్ చేస్తున్న 11,25,69,719 షేర్లతో పోలిస్తే 2.7 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.86–90 ధరల శ్రేణితో దేవయాని ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తోంది. 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయించగా.. వారి నుంచి 11.37 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోట కూడా పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది.
కృష్ణా డయోగ్నస్టిక్స్
డయోగ్నస్టిక్స్(వ్యాధి నిర్ధారణ) సేవలు అందించే కృష్ణా డయోగ్నస్టిక్స్ రూ.1,213 కోట్ల సమీకరణకు ఐపీవోను చేపట్టగా.. తొలిరోజే పూర్తి స్థాయి స్పందన అందుకుంది. 71,12,099 షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా.. 1,41,10,650 షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే రెండు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. ముఖ్యంగా రిటైలర్ల కోటా 9.59 రెట్లు అధికంగా బిడ్లు అందుకుంది. ఈ సంస్థ ఒక్కో షేరు ను రూ.933–954 ధరల శ్రేణిపై ఆఫర్ చేస్తోంది.
ఎక్సారోటైల్స్
టైల్స్ తయారీలోని ఎక్సారోటైల్స్ ఐపీవోలో భాగంగా 1,14,50,675 షేర్లను ఆఫర్ చేస్తుంటే.. తొలి రోజే 4.67 రెట్ల అధిక స్పందన అందుకుంది. మొత్తం 5,35,23,750 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైలర్ల కోటాలో 9.29 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి.
విండ్లాస్ బయోటెక్
ఈ ఔషధ తయారీ సంస్థ ఐపీవోలో భాగంగా 61,10,317 షేర్లను ఆఫర్ చేస్తోంది. మొదటి రోజే మూడు రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైలర్ల కోటాలో 6 రెట్లు అధికంగా స్పందన వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment