సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారితో జీవన శైలిలో నవీకరణ సంతరించుకుంది. మరోవైపు హైబ్రిడ్ పని విధానం, ఆన్‌లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంటిని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో విలాసవంతమైన గృహాలు జోరందుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎక్కువ మంది హెచ్‌ఎన్‌ఐలు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇండియా సోథెబీస్ ఇండియా ఇంటర్నేషనల్ రియల్టీ సర్వే వెల్లడించింది.
8 నగరాల్లో సర్వే
ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, గోవాలలో విలాసవంతమైన గృహ కొనుగోలుదారుల స్థితిని అంచనా వేసేందుకు సోథెబీస్ సర్వే నిర్వహించింది. టాప్–8 నగరాల్లో 200 మందికి పైగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలతో సర్వే చేసింది.
ధరల వృద్ధి ప్రారంభ దశలోనే..
76 శాతం మంది హెచ్‌ఎన్‌ఐలు ఈ ఏడాది ప్రాపర్టీ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 89 శాతం లగ్జరీ నివాస సముదాయం కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 11 శాతం మంది వాణిజ్య ప్రాపర్టీలకు ప్రణాళిక చేస్తున్నారు. 46 శాతం మంది ఈ ఏడాది రెండో ప్రాపర్టీ కొనుగోలు చేయనున్నారు. హెచ్‌ఎన్‌ఐలలో 31 శాతం మంది గత 18 నెలల్లో రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబడి సాధనంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది లగ్జరీ గృహాల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరల వృద్ధి ప్రారంభ దశలోనే ఉన్నాయి.
సమాచారం కోసం ఏజెంట్లే కీలకం..
హైబ్రిడ్ పని విధానం, ఆన్‌లైన్ క్లాస్‌లు కొనసాగుతుండటంతో చాలా మంది ఇంటిని అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న హెచ్‌ఎన్‌ఐలో సగం మంది హైబ్రిడ్ పని విధానానికి మొగ్గు చూపించగా.. 28 శాతం మంది ఆఫీస్‌లకు తిరిగి వెళ్లేందుకే ఆసక్తి కనబరిచారు. 15 శాతం మంది పూర్తిగా ఇంటి నుంచి పనికే ఇష్టం వ్యక్తం చేశారు. హెచ్‌ఎన్‌ఐలకు ప్రాపర్టీల సమాచార సేకరణలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రధానం కాగా.. కొనుగోలు నిర్ణయంలో మాత్రం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారమే ప్రధాన వనరుగా భావిస్తున్నారని సర్వేలో తేలింది.
లగ్జరీ కావాలి
ఈ ఏడాది 67 శాతం హెచ్‌ఎన్‌ఐలు లగ్జరీ గృహాల కోసం, 29 శాతం యూహెచ్‌ఎన్‌ఐలు హాలిడే హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.10–25 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ సిటీ అపార్ట్‌మెంట్లు, రూ.5–10 కోట్ల ధర ఉండే వెకేషన్ హోమ్స్ కొనుగోలుకు ఆసక్తిని కనబరిచారు. సర్వేలో పాల్గొన్న హెచ్‌ఎన్‌ఐలలో 34 శాతం మంది ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబైలతో పాటూ అభివృద్ధి చెందుతున్న నగరాలలో సిటీ అపార్ట్‌మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపించగా.. 29 శాతం మంది గోవా వంటి వెకేషన్ డెస్టినేషన్ ప్రాంతాలలో హాలీడే హోమ్ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. వెకేషన్ హోమ్స్ కోసం 71 శాతం మంది రూ.5–10 కోట్లు, 29 శాతం మంది రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సోథెబీస్ ఇండియా ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈఓ అమిత్ గోయల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment