కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేయవచ్చు గాక, కానీ స్టార్టప్‌లకు మాత్రం జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో చాలా స్టార్టప్‌ల అమ్మకాలు, లాభదాయకత అంచనాలకు మించి పెరిగాయి. దీంతో నిధుల సమీకరణ నిమిత్తం, లేదా మరింత విలువ పెంచుకోవడం కోసం (వేల్యూ అన్‌లాక్) పలు స్టార్టప్‌లు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లకు రానున్నాయి. అసలైతే రెండు, మూడేళ్ల తర్వాత గాని ఐపీఓల గురించి ఆలోచించని స్టార్టప్‌లన్నీ ఇప్పుడు ఐపీఓలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయమై సాక్షి స్పెషల్ స్టోరీ....
కరోనా వైరస్... స్టార్టప్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. డిజిటల్ కామర్స్, పేమెంట్స్ కంపెనీలు ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయి. స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీఓల ద్వారా తమ తమ వాటాలను విక్రయించనున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్ జొమాటొ, ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా, లాజిస్టిక్స్, డెలివరీ సంస్థ డెలివరీ, ఇన్సూరెన్స్ డిస్కవరీ ప్లాట్‌ఫార్మ్ పాలసీ బజార్, కళ్లజోళ్ల రిటైల్ చెయిన్ లెన్స్‌కార్ట్, విద్యాసేవలకు సంబంధించిన ఎడ్యుటెక్, ఆన్‌లైన్ ట్యూషన్ల సంస్థ బైజుస్.. ఈ సంస్థలన్నీ బాహాటంగానే తమ తమ ఐపీఓ ప్రణాళికలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, ఆన్‌లైన్ బిల్ చెల్లింపుల సంస్థ మోబిక్విక్‌లు కూడా ఐపీఓ కోసం కసరత్తు చేస్తున్నాయని సమాచారం.
కరోనాతో జోరు....
కరోనా కారణంగా ఈ స్టార్టప్‌ల వ్యాపారం కుదురుకోవడమే కాకుండా జోరుగా పెరిగేలా చేసిందని, అందుకే ఈ స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరుపుతున్నాయని నిపుణులంటున్నారు. ఈ కంపెనీల తదుపరి వ్యాపార వ్యూహం ఐపీఓయేనని వారంటున్నారు.
సీఈఓగా ప్రమోషన్... ఐపీఓ కోసమే
తమ కంపెనీ అమ్మకాలు, లాభదాయకత మరింతగా పెరిగాయని ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ పేర్కొన్నారు. ఫలితంగా ఐపీఓ ప్రణాళికలను ఈ కంపెనీ ముందుకు జరిపే అవకాశాలున్నాయి. ఇక మోబిక్విక్ సంస్థ తన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చందన్ జోషిని సీఈఓగా ప్రమోట్ చేసింది. ఐపీఓ ప్రణాళిక కోసమే ఈ మార్పు జరిగిందని సమాచారం. కాగా ఐపీఓకు వచ్చేది ఖాయమేనని, అయితే ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయిస్తామని బైజుస్ సీఈఓ బైజు రవీంద్రన్ ఇటీవలనే తెలిపారు.
ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌కే నష్టాలు వస్తున్నాయి. 2019లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్, ఈ సంస్థ హోల్‌సేల్ వ్యాపారాలకు కలిపి రూ.5,459 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరో ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో పోటీపడాలంటే ఐపీఓకు రావడమే ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న ఏకైక మార్గమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఐపీఓకువస్తే, ఈ స్టార్టప్‌ల విలువలు గతంలో మాదిరిగా భారీగా పెరగకపోవచ్చని విశ్లేషకులంటున్నారు.
విదేశాల్లో లిస్టింగ్
ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోంది. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక పాలసీ బజార్ సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో వచ్చే ఏడాది లిస్ట్ కావాలని కసరత్తు చేస్తోంది. 350 కోట్ల డాలర్ల విలువ సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారత కంపెనీల విదేశీ లిస్టింగ్‌కు సంబంధించి కంపెనీల సవరణ చట్టాన్ని ఇటీవలే లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణ కారణంగా భారత కంపెనీలు విదేశాల నుంచి నిధుల సమీకరణ గతంలో కంటే సులువు కానున్నది.
ముందుగానే ఐపీఓకు.... ఎందుకంటే
► కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ వచ్చింది. ఈ కాలంలో స్టార్టప్‌ల కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాలు, లాభదాయకత పెరగడంతో పలు సంస్థలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పడుతున్నాయి.
► కరోనాకు ముందు పీఈ(ప్రైవేట్ ఈక్విటీ), వీసీ(వెంచర్ క్యాపిటల్) సంస్థల నుంచి జోరుగా పెట్టుబడులు వచ్చాయి,. కరోనా కాలంలో ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో నిధుల కోసం స్టార్టప్‌లు ఐపీఓ వైపు చూస్తున్నాయి.
► గతంలో ఆలీబాబా, టెన్సెంట్ వంటి చైనా సంస్థల నుంచి స్టార్టప్‌లకు పెట్టుబడుల వరద పారేది. మన దేశంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో చైనా నుంచి పెట్టుబడుల విషయమై భారత ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. దీంతో చైనా సంస్థల నుంచి నిధులు రావడం లేదు. ఫలితంగా స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరపక తప్పడం లేదు.
గెట్.. సెట్.. స్టార్టప్!
Published Sat, Dec 19 2020 5:02 AM | Last Updated on Sat, Dec 19 2020 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment