గణాంకాలు, ఫలితాల ఎఫెక్ట్‌ | Statistics and the effect of results | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ఫలితాల ఎఫెక్ట్‌

Published Mon, Jan 13 2025 6:43 AM | Last Updated on Mon, Jan 13 2025 6:43 AM

Statistics and the effect of results

గణాంకాలు, ఫలితాల ఎఫెక్ట్‌     క్యూ3 జాబితాలో ఇన్ఫోసిస్, 

హెచ్‌సీఎల్, విప్రో ఆర్‌ఐఎల్, యాక్సిస్‌ బ్యాంక్, 

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌  ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు వివరాలు వెల్లడి

ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై  నిపుణుల అంచనాలు

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. డిసెంబర్‌ నెలకు యూఎస్, చైనా గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా విదేశీ పెట్టుబడులు, డాలరు ఇండెక్స్‌ కదలికలు తదితర అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. 

ఫలితాలకు రెడీ 
గత వారం ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ క్యూ3 ఫలితాలతో ఇన్వెస్టర్లను మెప్పించగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఆనంద్‌రాఠీ, ఏంజెల్‌ వన్, డెల్టా కార్ప్, హిమాద్రి స్పెషాలిటీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 13న, నెట్‌వర్క్‌ 18, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 14న, సియట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్‌టీటీఎస్, నెల్కో, ట్రాన్స్‌రైల్‌ 15న, యాక్సిస్‌ బ్యాంక్, హాట్సన్, హావెల్స్, ఇన్ఫోసిస్, కేశోరామ్, ఎల్‌టీఐఎం, మాస్టెక్, ఆర్‌ఐఎల్‌ 16న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో 17న అట్లాస్‌ సైకిల్, ఇండియన్‌ హోటల్స్, ర్యాలీస్, ఆర్‌కే ఫోర్జ్, ఎస్‌బీఐ లైఫ్, శేషసాయి పేపర్, స్టెరిలైట్‌ టెక్, స్వరాజ్‌ ఇంజిన్స్, టెక్‌ మహీంద్రా, విప్రో క్యూ3 ఫలితాలు తెలియజేయనున్నాయి. వారాంతాన(11న) డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్, జస్ట్‌డయల్‌ అక్టోబర్‌–డిసెంబర్‌ ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం సోమవారం(13న) కనిపించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ప్రవేశ్‌ గౌర్‌ పేర్కొన్నారు. 

ధరల వివరాలు 
డిసెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. నవంబర్‌లో సీపీఐ 5.48 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 6.21 శాతంగా నమోదైంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు రేపు(14న) విడుదలకానున్నాయి. నవంబర్‌లో డబ్ల్యూపీఐ 1.89 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 2.36 శాతంగా నమోదైంది. ఆహార ధరలు తగ్గడం ప్రభావం చూపింది. బుధవారం(15న) నవంబర్‌ నెలకు వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. నవంబర్‌లో వాణిజ్య లోటు అత్యధికంగా 37.8 బిలియన్‌ డాలర్లను తాకింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 20.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఆర్థిక గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. 

వాణిజ్య మిగులు 
డిసెంబర్‌ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు 13న విడుదలకానున్నాయి. నవంబర్‌లో వాణిజ్య మిగులు 97.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. డిసెంబర్‌ నెలకు యూఎస్‌ ఉత్పాదక ధరల ద్రవ్యో ల్బణ వివరాలు 14న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 15న వెలువడనున్నాయి. నవంబర్‌లో మూడు నెలల గరిష్టం 3.3 శాతానికి చేరింది. రిటైల్‌ అమ్మకాలు 16న వెల్లడికానున్నాయి. నవంబర్‌లో ఇవి 0.7 శాతం పెరిగాయి. 17న చైనా  2024 క్యూ3 జీడీపీ వివరాలు తెలియనున్నాయి. వార్షికంగా 4.6 శాతం ఎకానమీ వృద్ధిని అంచనా వేస్తున్నారు. క్యూ2లో 4.7 శాతం పురోగతిని సాధించింది.  

గత వారమిలా 
శుక్రవారం(11)తో ముగిసిన గత వారం మార్కెట్లు డీలా పడ్డాయి. 2 వారాల తదుపరి తిరిగి నష్టపోయాయి. సెన్సెక్స్‌ నికరంగా 1,844 పాయింట్లు (2.3 శాతం) పతనమైంది. 77,379 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 573 పాయింట్లు(2.4 శాతం) పడిపోయి 23,432 దిగువన స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మరింత అధికంగా 5.7 శాతం దిగజారగా.. స్మాల్‌ క్యాప్‌ 6 శాతంపైగా పడిపోయింది.

ఇతర అంశాలు 
ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకీ సరికొత్త కనిష్టాలను తాకుతోంది. గత వారం సాంకేతికంగా కీలకమైన 86 స్థాయినీ కోల్పోయింది. మరోపక్క యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్, ముడిచమురు ధరలు సైతం పుంజుకుంటున్నాయి. దీంతో గత వారం మార్కెట్లు పతన బాటలో సాగినట్లు మాస్టర్‌ ట్రస్ట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ పునీత్‌ సింఘానియా పేర్కొన్నారు. అయితే ఈ వారం క్యూ3 ఫలితాల ప్రభావం అధికంగా కనిపించనున్నట్లు తెలియజేశారు. అయితే యూఎస్, చైనా గణాంకాలు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలు సైతం మార్కెట్లలో ఒత్తిడికి కారణమవుతున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు.. జనవరి 10 వరకు రూ. 22,914 కోట్లు 
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మరోసారి నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(1–10 మధ్య) రూ. 22,194 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డిసెంబర్‌లో తొలుత అమ్మకాలు చేపట్టినప్పటికీ చివరి వారాల్లో కొనుగోళ్లకు దిగడంతో నికరంగా రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 109కు బలపడటం, కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన ట్రంప్‌ టారిఫ్‌లకు తెరతీయవచ్చన్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌ 4.6 శాతానికి పుంజుకోవడం, దేశ జీడీపీ వేగం తగ్గడం వంటి అంశాలు సైతం జత కలుస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.  

5 ఐపీవోల లిస్టింగ్‌ 
స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో ఈ వారం 5 కంపెనీలు లిస్ట్‌కానున్నాయి. గత వారం ఇష్యూలు పూర్తయిన హైదరాబాద్‌ కంపెనీ స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ(13న)తోపాటు రైల్వే రక్షణ రంగ కంపెనీ క్వాడ్రంట్‌ ఫ్యూచర్‌ టెక్, క్యాపిటల్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ ఇని్వట్‌(14న) లిస్ట్‌కానున్నాయి. ఈ బాటలో ఎస్‌ఎంఈలు బీఆర్‌ గోయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెల్టా ఆటోకార్ప్, అవాక్స్‌ అపారెల్స్‌ అండ్‌ ఆర్నమెంట్స్‌ 14న లిస్ట్‌కానున్నాయి. మరోవైపు 13న లక్ష్మీ డెంటల్‌ ఐపీవో ప్రారంభంకానుంది. ఈ బాటలోఎస్‌ఎంఈలు కాబ్రా జ్యువెల్స్, రిఖావ్‌ సెక్యూరిటీస్, ల్యాండ్‌మార్క్‌ ఇమ్మిగ్రేషన్, ఈఎంఏ పార్ట్‌నర్స్‌ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి.  

టాప్‌–5 కంపెనీలకు అమ్మకాల సెగ 
గత వారం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)రీత్యా టాప్‌–5 కంపెనీల మార్కెట్‌ విలువలో నికరంగా రూ. 1,85,952 కోట్లు ఆవిరైంది. జాబితాలో టాప్‌–5 కంపెనీల విలువ నష్టపోగా.. మిగిలిన 5 దిగ్గజాల మార్కెట్‌ క్యాప్‌ బలపడింది. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలువకు రూ. 70,479 కోట్లు చిల్లు పడింది. ఈ బాటలో ఐటీసీ విలువ రూ. 46,481 కోట్లు, స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) విలువ రూ. 44,935 కోట్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ రూ. 12,179 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ రూ. 11,877 కోట్లు చొప్పున క్షీణించింది. అయితే ఐటీ దిగ్గజం టీసీఎస్‌ మార్కెట్‌ విలువకు రూ. 60,169 కోట్లు జమకావడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement