కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు
సెన్సెక్స్ లాభం 875 పాయింట్లు
305 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ఇన్వెస్టర్లకు రూ.9 లక్షల కోట్ల లాభం
ముంబై: బ్యాంకులు, మెటల్, ఐటీ, ఆయిల్ షేర్లకు కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మూడు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లభించింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఏడు నెలల కనిష్టానికి చేరుకోవడంతో దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలకు దీటుగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు.
ఫలితంగా సెన్సెక్స్ 875 పాయింట్లు పెరిగి 79,468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 305 పాయింట్లు బలపడి 24,298 వద్ద నిలిచింది. ఉదయం భారీ లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1046 పాయింట్లు పెరిగి 79,639 వద్ద, నిఫ్టీ 345 పాయింట్లు బలపడి 24,338 వద్ద గరిష్టాలు అందుకున్నాయి.
ఇళ్ల క్రయ విక్రయాలపై చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల పన్నుకు సంబంధించి సడలింపుతో రియలీ్టతో పాటు అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్, క్యాప్ సూచీలు 2.63%, 2.39 శాతం లాభపడ్డాయి. ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను పెంచదంటూ బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ వ్యాఖ్యలతో పాటు అమెరికాలో మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి.
ఈఏడాది జూలై 23 కంటే ముందు ఇళ్ల క్రయ విక్రయాలపై చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కు సంబంధించి ఉన్న కొత్త, పాత విధానాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించడంతో రియల్టీ షేర్లు ర్యాలీ చేశాయి. ఒమెక్స్ 5%, ఒబేరాయ్ రియల్టీ , డీఎల్‌ఎఫ్ 3% రాణించాయి. అన్సల్ ప్రాపర్టీస్, మెక్రోటెక్, గోద్రెజ్ ప్రాపరీ్టస్ 2%, అజ్మీరా రియల్టీ 1%, మహీంద్రా లైఫ్‌స్పేస్ అర శాతం చొప్పున లాభపడ్డాయి.
సెన్సెక్స్ ర్యాలీతో ఒక్కరోజులో రూ.8.97 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.448 లక్షల కోట్లకు చేరింది.
తొలి త్రైమాసికంలో నికరలాభం 37% వృద్ధి చెందడంతో తో వేదాంత షేరు బీఎస్‌ఈలో 4.50% పెరిగి రూ.432.50 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment