ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ యాపిల్ ఐఫోన్‌ల సప్లయి తయారీ సంస్థ విస్ట్రాన్ కొనుగోలు కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్ట్‌లో టాటా గ్రూప్ - విస్ట్రాన్‌ల మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే భారత కంపెనీ ఐఫోన్‌ల తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది.
కర్ణాటక కేంద్రంగా విస్ట్రాన్ సంస్థ ఐఫోన్‌లను తయారు చేసి యాపిల్ సంస్థకు అందిస్తుంది. ఈ సంస్థ విలువ రూ.4942 కోట్లు. ఇందులో 10వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫాక్స్‌కాన్ ఐఫోన్ 14 మోడళ్లను తయారు చేసింది.
టాటా చేతుల్లోకి వచ్చేది అప్పుడే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, ఇతర ప్రోత్సహాకాలు పొందాలంటే నిబంధనల ప్రకారం.. విస్ట్రాన్ వచ్చే ఏడాది మార్చి వరకు ఐఫోన్‌లను తయారు చేయాల్సి ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే విస్ట్రాన్ తయారీ ప్లాంట్‌ను టాటా గ్రూప్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. ఒప్పందం, తయారీ ఇతర అంశాలపై టాటా గ్రూప్, విస్ట్రాన్‌లు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
కార్పొరేట్ ప్రపంచంలో
155 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసుల వరకు అన్నింటిని విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. విస్ట్రాన్‌తో ఒప్పందం పూర్తయితే కార్పొరేట్ చరిత్రలో టాటా గ్రూప్ అనే పేరు సువర్ణక్షరాలతో లికించపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment