న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ అన్‌ఎకాడమీ ఇకపై అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, లాభదాయకతపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్ జీతాల్లో కోత విధించడంతో పాటు గ్లోబల్ టెస్ట్ ప్రెప్ వంటి కొన్ని వ్యాపారాలను కూడా మూసివేయనుంది. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ ఈ విషయాలు తెలిపారు. ఆఫీసులో కాంప్లిమెంటరీగా ఇచ్చే మీల్స్, స్నాక్స్ కూడా ఇకపై ఉండబోవని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఎవరికీ కూడా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాల్లాంటి ప్రయోజనాలు లభించనవి ముంజల్ తెలిపారు.
అంతే కాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా నియమించిన డ్రైవర్లను కూడా తొలగిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఖాతాల్లో పుష్కలంగా రూ. 2,800 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ .. వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో లాభదాయకతను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముంజల్ వివరించారు. పనితీరు బాగాలేదంటూ ఇటీవలే 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 600 మంది) తొలగించిన అన్‌ఎకాడమీ తాజాగా మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment