
ఏటా కొత్త బడ్జెట్ వస్తున్నప్పుడల్లా దేశమంతా ఆసక్తిగా చూస్తారు. ఏయే మార్పులు ఉండబోతున్నాయి. పన్నులు ఏమైనా తగ్గుతాయా.. ధరలు తగ్గే వస్తువులేంటి.. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. తదితర విషయాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలోనే మార్పు వచ్చింది. ఏళ్లనాటి సంప్రదాయాలు మారాయి. అవేంటి.. ఎందుకు మారాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్యంతర బడ్జెట్
పార్లమెంట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ సమర్పణకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. ఇందులో ఎటువంటి ప్రధాన ప్రకటనలు ఉండవు. 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు దీనిని ప్లేస్‌హోల్డర్‌గా పరిగణిస్తారు.
బడ్జెట్ సమర్పణ తేదీ
కొన్నేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. 2017లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వలసరాజ్యాల కాలంలో మాదిరిగా ఫిబ్రవరి చివరి రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించబోమని ప్రకటించారు.
బ్రిటిష్ పాలనలో అనుసరించిన 92 ఏళ్ల పద్ధతికి ముగింపు పలికేందుకు నెల చివరి రోజు కాకుండా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త విధానాలు, మార్పులకు సిద్ధం కావడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం ఉందని, అందుకే బడ్జెట్ ప్రదర్శన తేదీని ఫిబ్రవరి 1కి మార్చినట్లు ఆయన పేర్కొన్నారు.
రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్
బ్రిటీష్ హయాంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. తర్వాత చాలా ఏళ్లు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. మోదీ ప్రభుత్వంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్‌ను సమర్పించే విధానాన్ని రద్దు చేశారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో అనుసంధానం చేయనున్నట్లు 2016లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
బడ్జెట్ సమర్పణ సమయం
1999 వరకు ఫిబ్రవరి నెల చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. బ్రిటీష్ ఇండియా నుంచి సంక్రమించిన ఈ సంప్రదాయం స్వాతంత్ర్యం తర్వాత కూడా మారలేదు. వలసరాజ్యాల కాలంలో బడ్జెట్ సమర్పణ సమయాన్ని బ్రిటన్ స్థానిక సమయం ద్వారా నిర్ణయించేవారు. దీని ప్రకారం బడ్జెట్‌ను బ్రిటన్‌లో ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) సమర్పించేవారు. ఇది భారతదేశంలో సాయంత్రం 5 గంటలకు సమానంగా ఉంటుంది.
తర్వాత 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. బడ్జెట్‌ను మరింత క్షుణ్ణంగా విశ్లేషించడానికి, చర్చించడానికి తగిన సమయం ఉండటమే ఈ మార్పు వెనుక కారణం.
Comments
Please login to add a commentAdd a comment