న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే.
మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది.
భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్‌లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు.
రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు
నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం
న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు.
సెమీకండక్టర్ పీఎల్‌ఐలో మార్పులు
సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీమ్‌లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్‌వర్క్ చైన్‌లో చిప్ ఫ్యాబ్‌లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్‌ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment