డ్రోన్ల వినియోగానికి సంబంధించి కేంద్ర సర్కారు ఇటీవలే నిబంధనలను సరళతరం చేసింది. దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేగవంతమైన డెలివరీకి డ్రోన్లు వీలు కల్పిస్తాయని తెలిసిందే. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం వల్ల తగిన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణలను సడలిస్తూ, పెట్టుబడులను ఆకర్షించే విధానాలను ప్రకటించింది. దీంతో డ్రోన్లను తయారు చేసే స్టార్టప్‌లలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో ఆసక్తి ఏర్పడింది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్‌ఐ) డ్రోన్ల తయారీ కంపెనీలకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలను సైతం కేంద్రం ప్రకటించడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచినట్టు చెప్పుకోవాలి. డ్రోన్ల తయారీలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఒక సీనియర్ అధికారి తెలిపారు. పీఎల్‌ఐ పథకం డ్రోన్ల తయారీకి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మంచి స్పందన వస్తోంది..
డ్రోన్ స్టార్టప్‌లకు మద్దతుగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్‌దూబే మీడియాకు తెలిపారు. ‘‘వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి వివరాలు కోరుతూ విచారణలు కూడా వస్తున్నాయి. పెట్టుబడుల సలహాల విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోదు. కానీ, మా విధానపరమైన మార్గదర్శకాలు తెలియజేయడం వల్ల వారిలో ఎంతో విశ్వాసం ఏర్పడుతుంది’’అని దూబే వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి డ్రోన్ తయారీ రంగం రూ.900 కోట్లను చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తద్వారా 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చని భావిస్తోంది. 2021 మార్చి నాటికి ఈ రంగంలో రూ.60 కోట్ల మేర వ్యాపారం నమోదు కావడం గమనార్హం. డ్రోన్ల వల్ల విస్తరించే సేవల విలువ రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని.. డ్రోన్ల నిర్వహణ, డ్రోన్ లాజిస్టిక్స్, డేటా ప్రాసెసింగ్, ట్రాఫిక్ నిర్వహణ తదితర విభాగాల్లో వచ్చే మూడేళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
ఇన్వెస్టర్లలో మార్పు..
ఇప్పటివరకు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు డ్రోన్ స్టార్టప్‌ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పౌర అవసరాలకు సంబంధించి డ్రోన్ల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా 2018లో ప్రభుత్వం ప్రకటించడం, నియంత్రణల పరంగా స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. 2011–2021 మధ్య డ్రోన్ స్టార్టప్‌లలో వచ్చిన పెట్టుబడులు రూ.310 కోట్లకు మించలేదని ట్రాక్సెన్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే కాలంలో అమెరికాలో 4 బిలియన్ డాలర్లు (రూ.29,600 కోట్లు), అంతర్జాతీయంగా 6.2 బిలియన్ డాలర్లు (రూ.46,000 కోట్లు) డ్రోన్ కంపెనీల్లోకి రావడం గమనార్హం.
భారత్‌లో డ్రోన్ల స్టార్టప్‌లు 158 ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 2,772 సంస్థలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ‘‘ప్రస్తుతం పలు ఇండియన్ డ్రోన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ నిధుల సమీకరణకు చర్చలు నిర్వహిస్తున్నాయి’’ అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్‌ఇండియా డైరెక్టర్ (పార్టనర్‌షిప్స్) అమిత్‌షా తెలిపారు. ఈ అసోసియేషన్‌లో 200 డ్రోన్ల కంపెనీలు, వాటికి సంబంధించి సేవల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.
►158. 2021 మార్చినాటికి దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం కంపెనీల సంఖ్య.
►30,000 డ్రోన్ల వినియోగానికి సంబంధించి విస్తరించనున్న సేవల విలువ. తద్వారా ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా
►310. 2011–2021 మధ్య దేశీ డ్రోన్ల స్టార్టప్‌లలోకి వచ్చిన పెట్టుబడులు
►10,000 ప్రత్యక్షంగా రానున్న ఉపాధి అవకాశాలు
►900. 2024 మార్చి నాటికి ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా వేస్తున్న విలువ
Comments
Please login to add a commentAdd a comment