డ్రోన్లు నడపాలనుకుంటున్నారా? ఉచిత శిక్షణ ఇదిగో! | Drone Flaying Training In Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రోన్లు నడపాలనుకుంటున్నారా? ఉచిత శిక్షణ ఇదిగో!

Published Thu, Jan 11 2024 12:00 PM | Last Updated on Thu, Jan 11 2024 1:20 PM

Drone Flaying Training In Hyderabad - Sakshi

అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. సాగును సరళతరం చేస్తూ ‘స్మార్ట్‌ వ్యవసాయం’ దిశగా పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. ఇండియా అభివృద్ధికి వ్యవసాయరంగ పురోగతి అత్యంత కీలకం. ప్రపంచ ఆహార భద్రత నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయి. ఇందుకోసం సాగులో యంత్రీకరణను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి.

ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం. అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో పూర్తి యంత్రాలను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో సాగులో డ్రోన్లు, రోబోల వాడకం ప్రారంభమైంది. అందుకుతోడుగా హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్స్‌ అనే అంకురసంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారుచేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది. డ్రోన్స్‌ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్‌ ప్రొవైడర్లకు, నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవాలనుకునే రైతులతోపాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్‌ లైసెన్సులు అందజేస్తోంది. 

హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 500 మందికి పైగా.. ఇతర రాష్ట్రాల్లో 300 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. కంపెనీ తయారుచేసిన ‘ఏజీ 365ఎస్‌ కిసాన్‌డ్రోన్‌’ (మల్టీయుటిలిటీ అగ్రికల్చర్‌ స్మాల్‌ కేటగిరీ డ్రోన్‌) ద్వారా మరింత మందికి శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. 25 కేజీల కంటే తక్కువ బరువు ఉండే ఈ డ్రోన్‌ ఫ్లైయింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా డీజీసీఏ అనుమతి పొందింది.

పదేళ్ల గడువుతో లైసెన్సు..

తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్‌ ఫ్లయింగ్‌ చేయాలంటే 18 ఏళ్ల వయసు, పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. దాదాపు రెండు వారాల్లో ఫ్లైయింగ్‌లో మెలకువలు పొందిన తర్వాత ఇన్‌స్ట్రక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పదేళ్ల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు.

దేశంలోనే ప్రథమం

‘ఏజీ 365 కిసాన్‌డ్రోన్‌’...చిన్న, మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్‌ కుమార్‌ అన్నారు. ఏజీ 365 డ్రోన్‌ను 1.5లక్షల ఎకరాల్లో విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు. దీన్ని వ్యవసాయంలో, డ్రోన్‌ శిక్షణ కోసం వినియోగించేందుకు ‘రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌పీటీఓ)’ అనుమతి లభించిందన్నారు. ఇలా రెండు ధ్రువీకరణలు అందుకున్న దేశంలోని తొలి డ్రోన్‌ ఇదేనని చెప్పారు. ఈ డ్రోన్‌కు 22 నిముషాల పాటు ఎగిరే సామర్థ్యం ఉంది. దీంతో పంట పొలాల్లో మందు పిచికారీ సులభం అవుతుంది. రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: చివరకు ఏఐలోనూ లింగవివక్ష!

కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వయంఉపాది పొందాలనుకునే మహిళలు, మహిళా రైతులకు రెండువారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన మహిళలు రోజూ డ్రోన్‌లను నడుపుతూ రూ.1500 వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో డ్రోన్‌ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే రూ.10లక్షల వరకు, సర్వీస్‌ ప్రొవైడర్లకు రూ.2కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 50-100 శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఆ రుణాలు ఎలా పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement