యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్‌లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌లో ఆర్బీఐ పేర్కొంది.
పీపీఐ అంటే..
పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్ బ్యాంక్ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment