ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్‌లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్‌నర్స్‌కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.
అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.
డిసెంబర్ మధ్యలో..
నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.
నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్‌మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్‌ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment