
న్యూఢిల్లీ: పాలనా సంబంధ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీ ఎన్‌ఎస్‌ఈ.. కొత్త ఎండీ, సీఈవో కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్ లిమాయే ఐదేళ్ల గడువు జూలైలో ముగియనుంది. దీంతో అర్హతగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహా్వనిస్తోంది. ఐపీవో సంబంధ అనుభవమున్న వ్యక్తులు ఈ నెల 25లోగా అప్లికేషన్లు పంపించవలసిందిగా తాజా నోటీసులో ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. లిమాయే మరోసారి పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు సైతం వీలుంది. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఈ పదవిని ఆశిస్తున్న ఇతర వ్యక్తులతో పోటీ పడి నెగ్గుకురావలసి ఉంటుంది.
2017లో తొలిసారి
ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా 2017 జూలైలో లిమాయే ఎంపికయ్యారు. అప్పటి ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ తదుపరి బాధ్యతలు స్వీకరించారు. అయితే వివిధ ఆరోపణల నడుమ 2013లో చిత్రా రామకృష్ణ నియామకంలో దరఖాస్తుదారులను ఆహ్వానించకపోవడంపై పలు త్రైమాసికాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక లిమాయే ఎన్‌ఎస్‌ఈకి రీబ్రాండింగ్‌ను కల్పించారు. ఆయన అధ్యక్షతన డెరివేటివ్స్‌లో లావాదేవీలు భారీ వృద్ధిని సాధించాయి. అయితే సాంకేతిక లోపాల కారణంగా గతేడాది కొన్ని ఇబ్బందులను సైతం ఎక్సేంజీ ఎదుర్కొంది.
తప్పనిసరి
కార్పొరేట్ పాలనలో సమర్థత, ఎంటర్‌ప్రైజ్ రిస్క్‌ల నిర్వహణ, మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ నిబద్ధత తదితర అర్హతలను తప్పక కలిగి ఉండాలంటూ తాజా నోటీసు లో అభ్యర్థులకు ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది. వీటికి అదనపు అర్హతలుగా లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తున్న అనుభవం లేదా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కంపెనీ నిర్వహణ తదితరాలను పేర్కొంది. దరఖాస్తుల గడువు ముగిశాక నామినేషన్లు, రెమ్యునరేషన్ కమిటీ అభ్యర్ధులను ఎంపిక చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment