న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 11.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 11.16 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ధరల స్పీడ్ రెండంకెలపైనే కొనసాగుతోంది. అయితే జూన్‌తో పోల్చితే టోకు ద్రవ్యోల్బణం తగ్గడమే కొంతలో కొంత ఊరట. ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం)లలో కూడా టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగింది.
అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి (లో బేస్ ఎఫెక్ట్) ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 జూలైని తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతం. అక్టోబర్ వరకూ టోకు ధరల తీవ్రతపై లో బేస్ ఎఫెక్ట్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► ఫుడ్ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం తగ్గు తూ వస్తోంది. జూలైలో అసలు ఈ విభాగంలో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది. జూన్‌లో ఇది 3.09%. ఉల్లి ధరలు మాత్రం జూలైలో 72.01% పెరిగాయి.
► క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు జూన్‌లో 36.34% ఉంటే, జూలైలో 40.28 శాతంగా ఉంది.
► సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం టోకు ధరల పెరుగుదల జూలైలో 11.20 శాతం. జూన్‌లో ఇది 10.88%.
Comments
Please login to add a commentAdd a comment