అమెరికా తలసరి ఆదాయంలో పావు శాతానికి చేరడానికి
ప్రపంచ బ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ: భారత్‌సహా 100కు పైగా దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా అవతరించడంలో తీవ్ర అవరోధాలను ఎదుర్కొంటున్నాయని ప్రపంచబ్యాంక్ నివేదిక ఒకటి పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో పావుశాతానికి చేరుకోవడానికి భారత్‌కు దాదాపు మరో 75 ఏళ్లు పట్టవచ్చని కూడా నివేదిక విశ్లేషించింది. చైనా విషయంలో 10 సంవత్సరాలు, ఇండోనేషియా విషయంలో 70 సంవత్సరాలు పడుతుందని కూడా నివేదిక పేర్కొంది. ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్’ అనే శీర్షికన వెలువరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
→ అమెరికా తలసరి ఆదాయం (నామినల్) ప్రస్తుతం దాదాపు 80,000 డాలర్లు ఉంటే, భారత్ విషయంలో ఈ విలువ దాదాపు 2,500 డాలర్లు.
→ 2023 చివరి నాటికి 1,136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య తలసరి కలిగిన 108 ప్రధాన దేశాలను పరిశీలిస్తే 600 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరు 75 శాతం. ఈ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు.
→ మున్ముందు ఆయా దేశాలు గతం కంటే కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న రుణాలు, తీవ్రమైన భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ఘర్షణలు అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడంలో పెరుగుతున్న కష్టాల వంటివి ఇక్కడ ముఖ్యమైనవి.
→ ఇంకా అనేక మధ్య–ఆదాయ దేశాలు ఇప్పటికీ గత దశాబ్ద కాల అనుభవాలతో పురోగతికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా పెట్టుబడిని విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం మొదటి గేర్‌లో కారును నడపడం, దానిని వేగంగా వెళ్లేలా చేయడానికి ప్రయతి్నంచడం వంటిది. – ఇదే పరిస్థితి కొనసాగితే, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ శతాబ్దం మధ్య నాటికి తగిన సంపన్న సమాజాలను సృష్టించే రేసును కోల్పోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇండెరి్మట్ గిల్ అన్నారు.
→ అధిక అధిక ఆదాయ స్థితికి చేరుకోవడానికి దేశాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా క్రమక్రమంగా మరింత అధునాతన విధానాలను అవలంబించవలసి ఉంటుంది.
→ 1990 నుండి కేవలం 34 మధ్య–ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే అధిక–ఆదాయ స్థితికి మారాయి. వాటిలో దాదాపు 10 దేశాలు యూరోపియన్ యూనియన్ ఏకీకరణ నేపథ్యంలోనో లేక ముందే ఆయా దేశాల్లో కనుగొన్న చమురు క్షేత్రాల నుంచి ప్రయోజనం పొందడం కారణంగానో అధిక ఆదాయ దేశాలుగా మారగలిగాయి.
ఎకానమీలో భారత్ ఐదవ స్థానం అయినా...
25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో దేశం చాలా వెనుకబడి ఉంది.
అభివృద్ధి చెందిన దేశమంటే...
ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,500 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment