హాంకాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలం ముగుస్తున్న ఆఖరు రోజుల్లోనూ చైనాను వదిలిపెట్టడం లేదు. తాజాగా మరో తొమ్మిది చైనీస్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ షాకిచ్చారు. స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్‌తో పాటు చైనాలో మూడో అతిపెద్ద చమురు సంస్థ సీఎన్‌వోవోసీ, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (కొమాక్), స్కైరీజన్ తదితర 9 సంస్థలను అమెరికా బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ కంపెనీలకు.. మిలిటరీతో సంబంధాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ కంపెనీల్లో అమెరికన్ ఇన్వెస్టర్లు.. తమకేమైనా పెట్టుబడులు ఉంటే వాటిని ఈ ఏడాది నవంబర్‌లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా తీసుకుంటున్న చర్యలన్నీ అమెరికా దేశ భద్రతకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించనున్నాయంటూ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన సంస్థలకు అమెరికన్ కంపెనీలు.. తమ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎగుమతులు చేయడం, టెక్నాలజీని బదలాయించడం వంటివి చేయకూడదు. ఇప్పటికే 60 చైనీస్ కంపెనీలను అమెరికా ఈ లిస్టులో చేర్చింది.
చైనా మిలటరీతో సంబంధాల్లేవు: షావోమీ
అయితే చైనా మిలటరీతో తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని షావోమీ తెలిపింది. నిబంధనలకు లోబడి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నామని స్పష్టం చేసింది. కంపెనీ, షేర్లహోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సమీక్షించుకుని, తదుపరి ప్రకటన జారీ చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment