
న్యూఢిల్లీ: జీ లెర్న్‌పై దివాలా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కి ఫిర్యాదు చేసింది. మొత్తం రూ. 468 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనందున కంపెనీపై చర్యలు తీసుకోవలసిందిగా యస్ బ్యాంక్ ఆరోపించినట్లు జీ లెర్న్ పేర్కొంది.
ఈ ఫిర్యాదుపై ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ నుంచి నోటీసు అందుకున్నట్లు వెల్లడించింది. నిజానిజాలను ధ్రువపరచుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ జీ లెర్న్ ఎడ్యుకేషన్ విభాగంలో సేవలందించే సంగతి తెలిసిందే.