ప్రతీకాత్మక చిత్రం
ఫుడ్, గ్రాసెసరీస్, రైడ్.. ఇలాంటి సేవలందించే గిగ్ ఎంప్లాయిస్ పడే కష్టాలు, ఇతరత్ర ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితుల్లోనూ అందించే సేవల గురించి తరచూ చూస్తుంటాం. అఫ్‌కోర్స్.. నాణేనికి రెండో వైపు మాదిరి ఇక్కడా సిన్సియారిటీ లేనివాళ్లూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ.. కంపెనీల నుంచి వాళ్లకు అందే సాయం, తోడ్పాటు విషయంలో మాత్రం విమర్శలే వినిపిస్తుంటాయి.
కానీ, తాజాగా జొమాటో చేసిన ఓ ప్రకటనపై ఇంటర్నెట్‌లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ జొమాటో డెలివరీబాయ్ విధుల్లో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోగా.. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది జొమాటో. ‘విధి నిర్వహణలో మా ఎగ్జిక్యూటివ్స్ పడే కష్టం ఏంటో మాకు మాత్రమే తెలుసు. అది అభినందనీయం. కానీ, సకాలంలో అందించాలనే తొందరలో మీరు (డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ను ఉద్దేశించి) ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మీకుటుంబాల గురించి కూడా కాస్త ఆలోచించండి’ అంటూ ఢిల్లీ జొమాటో ప్రతినిధి ఒకరు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీబాయ్ సలిల్ త్రిపాఠి కుటుంబానికి తోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
బాధితుడి పేరు సలిల్ త్రిపాఠి. ఢిల్లీ రోహిణి ఏరియాలో ఉంటోంది అతని కుటుంబం. సలిల్ తండ్రి కరోనాతో ఈమధ్యే చనిపోయాడు. దీంతో కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యాడు సలిల్. జొమాటోలో డెలివరీబాయ్‌గా అతను సంపాదించిన దాంతోనే ఆ కుటుంబం గడుస్తోంది. శనివారం రాత్రి బుధ్ విహార్‌లో డెలివరీ కోసం వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సలిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ మహేంద్ర.. ఆ సమయంలో తప్పతాగి ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే 50 లక్షలకు పైగా ఉన్న ఇండియన్ గిగ్ సెక్టార్‌లో.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఫెయిర్‌వర్క్2021 లిస్ట్ జాబితా ఈమధ్యే విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయంలో జొమాటో గతంతో పోలిస్తే.. ఉద్యోగుల కోసం మెరుగ్గా ఆలోచిస్తోందని (ఒకటి నుంచి 3 పాయింట్లకు చేరుకుంది) వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment