న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ నేటి (బుధవారం) నుంచీ ప్రారంభం కానుంది. షేరుకి రూ.72-76 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లను సమీకరించాలని జొమాటో భావిస్తోంది. ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది. చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ పెట్టుబడులున్న జొమాటో ఈ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్చేంజీలలో లిస్ట్ కానున్న తొలి దేశీ యూనికార్న్ స్టార్టప్‌గా నిలవనుంది. అంతేకాకుండా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగానూ ఆవిర్భవించనుంది. మరోవైపు 2020 మార్చిలో ఐపీవో ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించిన ఎస్‌బీఐ కార్డ్స్ తదుపరి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. వెరసి ఈ జనవరిలో వచ్చిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఇష్యూని అధిగమించనుంది. ఐపీవోలో భాగంగా జొమాటో రూ. 9,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
5 లిస్టెడ్ కంపెనీలు వెనక్కి...
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీలు ఐదు లిస్టింగ్ పొందాయి. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్, బర్గర్ కింగ్ ఇండియా, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, స్పెషాలిటీ రెస్టారెంట్స్. ఇష్యూ తదుపరి జొమాటో విలువ రూ.64,365 కోట్లను తాకనుంది. వెరసి ఈ విభాగంలోని లిస్టెండ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువను జొమాటో అధిగమించనుంది. జూబిలెంట్ మార్కెట్ విలువ రూ.40,771 కోట్లుకాగా.. వెస్ట్‌లైఫ్ మార్కెట్ క్యాప్ రూ.8,381 కోట్లు.
యాంకర్ పెట్టుబడులు: ఐపీవోలో భాగంగా మంగళవారం(13న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో 56 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించినట్లు తెలుస్తోంది. షేరుకి రూ.76 ధరలో విక్రయించినట్లు సమాచారం.
నేటి నుంచి జొమాటో ఐపీఓ
Published Wed, Jul 14 2021 12:12 AM | Last Updated on Wed, Jul 14 2021 10:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment